సింగరేణి కార్మికులకు..లాభాల్లో 32 శాతం వాటా

సింగరేణి కార్మికులకు..లాభాల్లో 32 శాతం వాటా
  • జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • కార్మికులకు రూ. 711 కోట్లు చెల్లించనున్న సంస్థ
  • గత ఏడాది కంటే 2 శాతం లాభం వాటా పెంచిన సర్కారు

హైదరాబాద్​/గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ 2022‒23 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి కార్మికులకు 32 శాతం వాటా(స్పెషల్‌‌‌‌ ఇన్సెంటివ్‌‌‌‌) చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశాల మేరకు వాటా చెల్లింపులకు సంబంధించిన జీవోను సీఎం స్పెషల్‌‌‌‌ సెక్రెటరీ ఎస్‌‌‌‌.నర్సింగరావు మంగళవారం విడుదల చేశారు. 

ఈలాభాల వాటా దసరా ముందు చెల్లించనుండగా, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సింగరేణి సీఎండీకి, ఇంధన శాఖ స్పెషల్​సీఎస్​కు సూచించారు. 2022‒23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.32,830 కోట్ల టర్నోవర్‌‌‌‌ చేయగా, తద్వారా రూ.2,222  కోట్ల లాభాలను సాధించింది. ఈ లాభాల్లో నుంచి 32 శాతం వాటాగా అంటే రూ.711 కోట్లను కార్మికులకు చెల్లించనున్నది.

దసరా ముందు ఈ లాభాల వాటాను 42 వేల మంది కార్మికులు పనిచేసే ఏరియా, హాజరు ఆధారంగా చెల్లింపులు చేస్తారు. 2021‒22 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.1,226 కోట్ల లాభాలు సాధించగా అందులో 30 శాతం వాటా కింద రూ.368 కోట్లను కార్మికులకు చెల్లించారు. నిరుటి రూ.368 కోట్ల వాటాతో పోలిస్తే ఈసారి కార్మికులు దాదాపు రెట్టింపు(రూ.711 కోట్ల) లాభాల వాటా పొందనున్నారు.

తమ ఒత్తిడి, పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 32 శాతం లాభాల వాటాను ప్రకటించిందని ఏఐటీయూసీ జనరల్‌‌‌‌ సెక్రెటరీ వి.సీతారామయ్య, బీఎంఎస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ యాదగిరి సత్తయ్య ప్రకటించారు.