ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్కార్ ​దృష్టి

ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్కార్ ​దృష్టి
  • కసరత్తు చేస్తున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్కార్ ​దృష్టి పెట్టింది. వివిధ పోటీ పరీక్షలతో ఈ ఎగ్జామ్స్ లింక్ అయి ఉండటంతో మే 2 నుంచి 20 వరకు నిర్వహించాలని యోచిస్తోంది. మరోపక్క ఏపీలోనూ మే 5 నుంచి 22 వరకూ ఇంటర్ పరీక్షలు ఉండే అవకాశముంది. ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ఎగ్జామ్స్​ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షల షెడ్యూల్​ను ఇంటర్ బోర్డు తయారు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 9 లక్షలకు పైగా స్టూడెంట్లు ఇంటర్ చదువుతున్నారు. గతేడాది కొవిడ్ ఎఫెక్ట్ తో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో సెకండియర్ స్టూడెంట్లను ఫస్టియర్ మార్కుల ఆధారంగా పాస్ చేసింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించింది. దీంట్లో కేవలం 49% మంది మాత్రమే పాస్ కావడంతో పలువురు స్టూడెంట్లు సూసైడ్ చేసుకున్నారు. దీంతో స్టూడెంట్ యూనియన్లు, పొలిటికల్ లీడర్లు ఆందోళనకు దిగడంతో ఫెయిలైన స్టూడెంట్లకు మినిమమ్ మార్కులతో పాస్ చేస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. మే నెలలో జరిగే వార్షిక పరీక్షలకు ఇటీవలె ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.