టీచర్లకు ‘ఏఐ’ సపోర్ట్... తెలంగాణలో ‘శిక్షా కోపైలట్’ అమలు.. సర్కారు బడుల్లో జనరేటివ్ ఏఐ పాఠాలు

టీచర్లకు ‘ఏఐ’ సపోర్ట్... తెలంగాణలో ‘శిక్షా కోపైలట్’ అమలు.. సర్కారు బడుల్లో జనరేటివ్ ఏఐ పాఠాలు
  • ‌‌‌‌‌‌‌‌లెసన్ ప్లాన్లు, కంటెంట్ క్రియేషన్‌కు ఏఐ వాడకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో బోధనను మరింత సులభతరం చేసేందుకు విద్యా శాఖ అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టీచర్లపై పనిభారాన్ని తగ్గించి, బోధనా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ‘శిక్షా కోపైలట్ – ఎంపవరింగ్ టీచర్స్ విత్ జెన్ -ఏఐ’ ప్రోగ్రామ్‌‌‌‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి జిల్లాలోని సర్కారు, లోకల్ బాడీ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గతేడాది వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 500 స్కూళ్లలో వెయ్యి మంది టీచర్లతో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్టడీలో సానుకూల ఫలితాలు వచ్చాయి. ఏఐ వాడడంతో పాఠాలు రూపొందించడంలో టీచర్లకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరిగినట్లు అధికారులు గుర్తించారు. 

అందుకే రాష్ట్రమంతటా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి 6 నుంచి 10వ తరగతి భోదించే ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ టీచర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియం స్కూళ్లలో దీన్ని అమలు చేస్తారు. 

ఏమిటీ శిక్షా కోపైలట్..?

ఇది ఒక ఏఐ ఆధారిత ప్లాట్‌‌‌‌ఫామ్. టీచర్లకు లెసన్స్ ప్లాన్ చేయడంలో సాయపడుతుంది. ప్రధానంగా రాష్ట్ర సిలబస్‌‌‌‌కు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించుకోవచ్చు. ఆకర్షణీయమైన లెసన్స్‌‌‌‌ ప్లాన్లు, ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌లు ఏఐ సాయంతో సెకన్లలో తయారు చేసుకోవచ్చు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు కస్టమైజ్డ్ క్వశ్చన్ బ్యాంక్‌‌‌‌లను ఈ ప్లాట్‌‌‌‌ఫామ్ ద్వారా జనరేట్ చేసుకునే వీలుంది. 

అయితే, ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఎస్సీఈఆర్టీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రత్యేకంగా డ్యాష్‌‌‌‌బోర్డ్ యాక్సెస్ ఇస్తారు. భాగస్వామ్య సంస్థ ప్రతినిధులు ఎప్పటికప్పుడు స్కూళ్లను సందర్శించి టీచర్ల నుంచి ఫీడ్‌‌‌‌బ్యాక్ తీసుకుంటారు.