టెన్త్ సిలబస్ ఎంత?.పేపర్లు ఎన్ని.. ఇంకా క్లారిటీ ఇవ్వని సర్కార్

టెన్త్ సిలబస్ ఎంత?.పేపర్లు ఎన్ని.. ఇంకా క్లారిటీ ఇవ్వని సర్కార్

హైదరాబాద్​, వెలుగు: అకడమిక్​ ఇయర్​ మొదలై మూడు నెలలు దాటినా ఇప్పటికీ పదో తరగతి పరీక్షలపై క్లారిటీ రాలేదు. రెండేండ్లుగా బోర్డ్​ ఎగ్జామ్స్​ లేకపోవడంతో ఈ ఏడాది పరీక్షలను ఎట్ల పెడ్తరోనని స్టూడెంట్లలో అయోమయం ఉంది. పాతపద్ధతిలాగానే 11 పేపర్లుంటయా? లేదంటే నిరుడు నిర్ణయించినట్టు 6 పేపర్లే ఉంటయా? సిలబస్​ ఎంత? అన్న దానిపై విద్యాశాఖలో ఇంత వరకు కనీసం చర్చ కూడా జరగలేదు. సర్కార్​ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వల్లే ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. క్వశ్చన్​ పేపర్లు, ఎగ్జామ్స్​ విధానంపై టీచర్లకూ ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో.. స్టూడెంట్లు అడిగినా టీచర్లు ఏం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,675 హైస్కూళ్లలో ఐదున్నర లక్షల మంది టెన్త్​ చదువుతున్నారు. జులై ఫస్ట్​ నుంచి ఆన్​లైన్​ క్లాసులు మొదలవగా.. సెప్టెంబర్​ ఒకటి నుంచి ఫిజికల్​ క్లాసులు జరుగుతున్నాయి.  

ఎట్లుంటదో!

కరోనా వల్ల 2020, 2021లో టెన్త్​ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్నల్​ మార్కుల ఆధారంగానే ఫైనల్​ మార్కులిచ్చి అందరినీ పాస్​ చేసింది. 2020లో 11 పేపర్లతో ఎగ్జామ్స్​ పెట్టేందుకు సర్కార్​ రెడీ అయింది. మూడు పరీక్షలు పెట్టాక.. కరోనా కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎగ్జామ్స్​ను రద్దు చేసింది. 2021లో 11 పేపర్లను ఆరుకు కుదించింది. అయితే, కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆ పరీక్షలను రద్దు చేసింది. అయితే, ఈ ఏడాది మాత్రం ఎగ్జామ్​ పెట్టే పేపర్లు, క్వశ్చన్​పేపర్​ ప్యాటర్న్​ను ఇంతవరకు తేల్చలేదు. ఏటా అక్టోబర్​ లేదా నవంబర్​లో టెన్త్​ ఎగ్జామ్​ ఫీజులను వసూలు చేస్తుంటారు. ఆలోగానే ఎస్​ఈఆర్టీ, పరీక్షల విభాగం అధికారులు పరీక్ష విధానంపై క్లారిటీ ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై టీచర్ల సంఘాల నేతలు మండిపడుతున్నారు.  

సిలబస్​ ఎంత? 

నిరుడు వంద శాతం సిలబస్​ చెప్పాలని సర్కార్​ ఆదేశించినా.. ఎగ్జామ్స్​లో మాత్రం 70 శాతమే లెక్కలోకి తీసుకుంటామని బోర్డు ప్రకటించింది. ఈ అకడమిక్​ ఇయర్​లో జనవరి పది లోపే వంద శాతం సిలబస్​ను పూర్తి చేయాలని అకడమిక్​ క్యాలెండర్​లో పేర్కొన్నారు. అయితే, అది సాధ్యమయ్యేది కాదని, సిలబస్​ను తగ్గించాలని టీచర్ల సంఘాలు కోరుతున్నా.. సర్కార్​ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇటు టీచర్లతోపాటు స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. సర్కార్​ ఆదేశాల మేరకే తాము ముందుకెళ్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.