హైదరాబాద్ , వెలుగు: బీసీ జాబితాలో ఉన్న కులాల పేర్లు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీసీ సంక్షేమ శాఖ శనివారం జీవోలు జారీ చేసింది. ఈ నెల 4న కులాల పేర్ల మార్పుకు కేబినెట్ ఆమోదించింది. ఇందుకు తగ్గట్టుగా శనివారం బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి 7 కులాల పేర్లు మార్చుతూ జీవో లు జారీ చేశారు. దొమ్మర కులం పేరును ‘గడవంశీయ’గా మార్చాలని, పిచ్చిగుంట్ల పదాన్ని తొలగించి ‘వంశరాజ్’ను మాత్రమే కొనసాగించాలని జీవో సూచిం చింది.
తమ్మళి కులంతో పాటుగా అవమానకరంగా ఉన్న ‘శూద్ర కులం’ పదాలను తొలగించాలని జీవోలో పేర్కొన్నారు. బుడబుక్కల కులాన్ని ‘శివక్షత్రియ’ పేరుతో వ్యవ హరించబడేలా, చాకలి కులానికి ‘ధోబి’ అనే పర్యాయపదాన్ని చేర్చాలని, మేర కులానికి ‘మేరు’ అనే పర్యాయపదాన్ని చేర్చాలని, వీర భద్రీయ కులం పేరును ప్రధానంగా ప్రస్తావిస్తూ దాని అనుబంధ కులాలైన వీరముష్టి, నెత్తికోతల క్రమాన్ని మారు స్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
