- వేటికి అవసరమో ప్రపోజల్స్ పంపండి
- ఫీల్డ్‌లో వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు
- జూన్ చివరి నాటికి రిపేర్లు పూర్తి చేసే యోచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని గురుకుల స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో చేపట్టాల్సిన రిపేర్లు, వాటికి అయ్యే ఖర్చు వివరాలను అంచనా వేసి అందజేయాలని ఆయా గురుకుల సొసైటీ సెక్రటరీలను ప్రభుత్వం ఆదేశించింది.
99 రోజుల ప్రజా పాలనలో భాగంగా ప్రస్తుతం వెల్ఫేర్ వీక్ కార్యక్రమం సాగుతోంది. ఇందులో ఒకరోజు ప్రత్యేకంగా వీటి మరమ్మతులపై అన్ని స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ కు అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ వివరాలను రిపోర్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే వారం ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
8 లక్షల మంది స్టూడెంట్స్
రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల పరిధిలో మొత్తం 8 లక్షల మంది స్టూడెంట్లు చదవుతున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సొంత బిల్డింగ్స్ లు ఉండగా ఎక్కువ శాతం అద్దె బిల్డింగ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అద్దె బకాయిలు ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ చానెల్ ద్వారా వెంటనే బకాయిలు చెల్లిస్తున్నది. ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో మొత్తం 166 ఇన్ స్టిట్యూషన్స్ ఉండగా ఇందులో 100 సొంత బిల్డింగ్స్, మరో 66 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో మొత్తం 268 ఉండగా ఇందులో 115 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా 253 సొంత బిల్డింగ్ లు ఉన్నాయి.
బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 268 ఉండగా ఇందులో 31 మాత్రమే ప్రభుత్వ బిల్డింగ్ లు కాగా.. మిగతావన్నీ ప్రైవేటువే ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్ ఓనర్స్ తో ఇటీవల అధికారులు మీటింగ్ నిర్వహించారు. రిపేర్లు ఉన్న చోట్ల చేయాల్సిందే అని ఓనర్లకు స్పష్టం చేశారు. అద్దె బకాయిలు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు క్లియర్ చేసిన నేపథ్యంలో రిపేర్లు చేస్తామని ఓనర్లు చెప్పారని అధికారులు అంటున్నారు. ఈ రిపేర్లు అన్నింటినీ జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెద్ద ఎత్తున రిపేర్లు
రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్న గురుకుల హాస్టల్స్, స్కూళ్లు, కాలేజీల్లో పెద్ద ఎత్తున రిపేర్లు చేయాల్సి ఉన్నాయి. ముఖ్యంగా డైనింగ్ హాల్, కిచెన్, టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, కిటికీలు, డోర్లు ఇలా ఎన్నో రిపేర్లు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో బడుగుబలహీన వర్గాల స్టూడెంట్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులు భోజనం చేసే చోట శుభ్రత, తగినంత వెలుతురు, ఫ్యాన్లు, కూర్చునేందుకు అవసరమైన బెంచీల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వంట గదుల్లో పొగ రాకుండా చిమ్నీల ఏర్పాటు, ఆధునిక వంట పరికరాలు, నీటి సౌకర్యంపై వివరాలు సేకరిస్తున్నారు. గురుకులాల్లో అతిపెద్ద సమస్యగా ఉన్న టాయిలెట్ల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణం, నిరంతర నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

