భూముల మానిటైజేషన్‌‌‌‌‌‌‌‌ వేగవంతం..ఉప్పల్ భగాయత్ తరహాలోనే మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలి

భూముల మానిటైజేషన్‌‌‌‌‌‌‌‌ వేగవంతం..ఉప్పల్ భగాయత్ తరహాలోనే మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలి
  •     రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల మానిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం ద్వారా ఆదాయ వనరులను క్రమబద్ధీకరించుకోవాలని కేబినెట్​సబ్ కమిటీ నిర్ణయించింది. శనివారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్​సబ్ కమిటీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో  మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబుతో కలిసి వివిధ శాఖల ద్వారా అందుతున్న ఆదాయ పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లోతుగా సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూసంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అధికారులు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గతంలో విజయవంతమైన ‘ఉప్పల్ భగాయత్’ నమూనా తరహాలోనే అత్యంత పారదర్శక విధానాలను అవలంబిస్తూ, నగర పరిధిలో మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉన్న అనుకూల అవకాశాలను తక్షణమే గుర్తించాలని మున్సిపల్ అధికారులను  భట్టి విక్రమార్క ఆదేశించారు.  

రాజధానిని ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రభుత్వ భూముల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి, ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను వేగంగా అన్వేషించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించడంతోపాటు రాబోయే బడ్జెట్ అవసరాలకు తగ్గట్టుగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలకు తగ్గట్టుగా నిధులు రాబట్టాలని  ఆదేశించారు. ఆదాయ పెంపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తుగా రూపొందించుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌లైన్  ప్రకారమే అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.