- ఈ–కేవైసీ గడువు ఆగస్టు 31 వరకూ పొడిగింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో రేషన్‌లబ్ధిదారులకు మరోసారి మూడు నెలలకు ఒకేసారి రేషన్పంపిణీ చేయాలని పౌరసరఫరాల అధికారులు నిర్ణయించారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలకు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ జరుగుతుందని హైదరాబాద్జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) రాజిరెడ్డి తెలిపారు. గ్రేటర్‌పరిధిలో 1560 రేషన్ షాపుల ద్వారా శనివారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు.
పంపిణీలో బయోమెట్రిక్ కీలకం కాబట్టి డీలర్లు ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్జిల్లాలో ఉన్న 653 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు 59,602.822 టన్నుల బియ్యం, అలాగే 7,279.513 టన్నుల గోధుమలు పంపిణీ చేయనున్నట్టు సీఆర్ఓ రాజిరెడ్డి తెలిపారు. బియ్యం ఉచితంగా ఇస్తామని, గోధుమలు కిలోకు రూ.7 చొప్పున చెల్లించాలన్నారు.
ఈ–కేవైసీ గడువు పెంపు
భారీ వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించినట్టు సీఆర్ఓ రాజిరెడ్డి తెలిపారు. ఎవరైనా నేరుగా తమ దగ్గరలోని రేషన్‌షాపునకు వెళ్లి బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు ఇవ్వడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.
బయోమెట్రిక్ ఒకేసారి అయితే బెటర్
మూడు నెలల బియ్యం పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్‌ను ఒకేసారి తీసుకునేలా అనుమతించాలని రేషన్ డీలర్లు అధికారులను కోరుతున్నారు. 3 నెలలకు సంబంధించి మూడు సార్లు వేలి ముద్రలు తీసుకోవాలంటే చాలా సమయం పడుతోందని, దీంతో షాపుల ముందు రద్దీ పెరిగి బియ్యం పంపిణీకి ఇబ్బంది కలుగుతోందని డీలర్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రేషన్ షాపుల వద్ద ఈ-కేవైసీ క్యూలైన్లు
మెహిదీపట్నం: రేషన్ ఈ–కేవైసీ గడువు పొడిగించారని తెలియక లబ్ధిదారులు గురువారం రాత్రి వరకు నగరంలోని పలు రేషన్ షాపుల ఎదుట బారులు తీరారు. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లోని ఓ రేషన్ షాపు వద్ద ఇలా క్యూ కట్టారు.
