రూ.లక్ష సాయానికి..4.5 లక్షల అప్లికేషన్లు..దరఖాస్తులకు ముగిసిన గడువు

రూ.లక్ష సాయానికి..4.5 లక్షల అప్లికేషన్లు..దరఖాస్తులకు ముగిసిన గడువు
  • సర్వర్ పని చేయక.. సర్టిఫికెట్లు అందక లక్షల మంది అప్లై చేసుకోలే
  • గడువు పెంచాలంటూ ఆందోళనలు.. పొడిగించేది లేదన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: బీసీ కులవృత్తులు, చేతివృత్తుల వాళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తంగా 4.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లు మొదలైన దగ్గర్నుంచి సర్వర్ సతాయించడం.. క్యాస్ట్, ఇన్​కమ్ సర్టిఫికెట్లు అందకపోవడం.. రేషన్ కార్డుల్లేకపోవడంతో లక్షలాది మంది అప్లై చేసుకోలేకపోయారు. గడువు పెంచేది లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నా.. నెలకు ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తరు? ఎంత మందికి ఇస్తరు? తదితర వివరాలను బయటకు చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల జనం ఆందోళన కూడా చేశారు.

రెవెన్యూ ఆఫీసుల వద్ద పడిగాపులు పడినా

బీసీలకు ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే క్యాస్ట్, ఇన్​కమ్, రేషన్​కార్డులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అవి లేనివాళ్లు తిప్పలుపడ్డారు. వాస్తవానికి ఇన్​కమ్ సర్టిఫికెట్ అయితే వారం రోజులు.. క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే రెండు వారాల్లో ఇవ్వాల్సి ఉంటుందని అధికారులే చెప్తున్నారు. 

కానీ రెండు వారాల కిందట క్యాస్ట్, ఇన్​కమ్ సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకున్నోళ్లకూ వాటిని ఇవ్వడం లేదు. రూ.లక్ష సాయానికి గడువు తీరిపోతుందని ఎంతో మంది ఎమ్మార్వో ఆఫీసులు, మీసేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ముందుగా అప్లై చేసుకున్నోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని, తేదీల వారీగా పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. అప్లై చేసుకున్నోళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇప్పుడు ఆత్రంగా వాటిని క్లియర్ చేయడమేందని మండిపడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం ఎమ్మార్వో ఆఫీసుల దగ్గరికెళ్తే మీసేవ కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. మీసేవ దగ్గరకు పోతే.. తహసీల్దార్ ఆఫీసులకే పోవాలంటూ పంపారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారికి సర్టిఫికెట్లు మాత్రం అందలేదు. చోటామోటా లీడర్ల పైరవీలతో వస్తున్న వాళ్లు.. చేతులు తడిపినోళ్లకు మాత్రమే సర్టిఫికెట్లను తొందరగా జారీ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

సర్వర్ డౌన్.. నంబర్లు రాసిచ్చి పంపిన్రు

క్యాస్ట్, ఇన్​కమ్ సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకునేటోళ్ల సంఖ్య భారీగా ఉండడంతో సర్వర్లు మొరాయించాయి. దీంతో సర్టిఫికెట్లు జారీ అయిన కొద్ది మందికి ప్రింట్లు తీసి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మందికి స్లిప్పుల మీద క్యాస్ట్, ఇన్​కమ్ సర్టిఫికెట్ల నంబర్లు రాసిచ్చి.. వాటితో రూ.లక్ష సాయానికి అప్లై చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆర్​ఐలు, ఎమ్మార్వోలు సంతకాలు చేయడం లేదని బాధితులు వాపోయారు. .

కొన్ని కులాల వారికే సర్టిఫికెట్లు

అప్లికేషన్‌‌కు సంబంధించిన వెబ్‌‌సైట్‌‌లో అన్ని కులాల పేర్లు చూపిస్తున్నా.. క్యాస్ట్, ఇన్​కమ్ కోసం ఎమ్మార్వో ఆఫీసులకు పోతే మెమోలో పేర్కొన్న కులాల వాళ్లకే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈమేరకు పలు ఎమ్మార్వో ఆఫీసుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో వారికే క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేశారు. వాస్తవానికి పథకం మొదలైన జూన్ 6 నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. పథకం, వెబ్​సైట్​ను ప్రారంభించిన తొలి రోజు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతి 2రోజులు సర్వర్ ఇబ్బంది పెట్టింది. అప్లికేషన్ పూర్తయ్యాక సబ్మిట్ చేసినా తీసుకోలేదు. దీంతో చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు. గైడ్​లైన్స్ గందరగోళంగా ఉండడం, కేబినెట్​ సబ్ కమిటీ భేటీలో కలెక్టర్లు డౌట్లు లేవనెత్తడంతో.. పథకం జీవోకు సంబంధించి ఎవరెవరు అర్హులు అన్న అంశాలతో మరో మెమోను సర్కారు జారీ చేసిం ది. అందులో 14 ప్రధాన కులాలతోపాటు ఎంబీసీలోని కులాలకే అప్లై చేసుకునే చాన్స్​ కల్పించారు. ఇప్పుడు ఎమ్మార్వో ఆఫీసుల్లోనూ ఆయా కులాల వాళ్లకే సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఫ్లెక్సీలు పెట్టడంతో మరి తమ పరిస్థితేందని మిగతా కులాలవాళ్లు ప్రశ్నిస్తున్నారు.

కాలేజీ విద్యార్థులకూ తిప్పలే

స్కూళ్లు, కాలేజీలు ఇప్పటికే తెరుచుకున్నాయి. కాలేజీ విద్యార్థులకు స్కాలర్​షిప్పులు, ఫీజు రీయింబర్స్​మెంట్లు, సీట్ల అలాట్​మెంట్, కౌన్సెలింగ్​కు సంబంధించి క్యాస్ట్, ఇన్​కమ్ సర్టిఫికెట్లు కీలకం. దీంతో విద్యార్థులు కూడా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. బీసీలకులక్ష సాయం పథకం నేపథ్యంలో.. భారీగా దరఖాస్తులు రావడంతో తమకు సర్టిఫికెట్ల జారీని ఆపుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ముందుగా బీసీలకు సాయం కోసం చేసుకున్న దరఖాస్తులనే క్లియర్ చేస్తున్నారని, ఆ తర్వాత తమ అప్లికేషన్లను క్లియర్ చేస్తామని అధికారులు చెప్తున్నట్టు విద్యార్థులు అంటున్నారు. అప్లై చేసుకుని రెండు మూడు వారాలవుతున్నా సర్టిఫికెట్లు రావడం లేదని అంటున్నారు.

రేషన్ కార్డుల్లేక..

అప్లికేషన్లకు రేషన్ కార్డులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే.. రేషన్ కార్డు వివరాలు పక్క ట్యాబ్​లో వచ్చేస్తున్నాయి. కానీ చాలా మందికి రేషన్ కార్డుల్లేవు. మూడేండ్ల నుంచి కొత్త వాళ్లకు రేషన్ కార్డులివ్వలేదు. చివరిసారిగా 2018 ఎన్నికలప్పుడు కొత్త అప్లికేషన్లకు సర్కారు ఓకే చెప్పింది. దీంతో అప్పట్లో 9 లక్షల మందికిపైగా రేషన్​కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. మూడేండ్ల తర్వాత 2021లో 3 లక్షల మందికే రేషన్ కార్డులను సర్కారు అందజేసింది. మిగతా ఆరు లక్షల అప్లికేషన్లను వివిధ కారణాలతో రిజెక్ట్​ చేయడమో.. ప్రాసెస్ చేయకుండా ఆపేయడమో చేసింది. మళ్లీ ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డుల ఊసేలేదు. ఈ నేపథ్యంలోనే బీసీలకు రూ.లక్ష సాయంలో రేషన్​ కార్డు లేని బీపీఎల్​(దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న) కుటుంబాల పరిస్థితేందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
==============================================================