- మూడేండ్ల తర్వాత పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు
- ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యా శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులను సర్కారు నియమించింది. గత మూడేండ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీచేస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ, జేఎన్టీయూహెచ్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ వర్సిటీలకు పాలక మండళ్లను ఖరారు చేస్తూ వేర్వేరుగా జీఓలు రిలీజ్ చేశారు. దీంతో ఆయా వర్సిటీల్లో కీలక నిర్ణయాలకు మార్గం సుగమమైంది. క్లాస్1 కేటగిరిలో ప్రతి వర్సిటీ ఈసీలో ముగ్గురు ఐఏఎస్లు (విద్యాశాఖ సెక్రటరీ, కాలేజీ/సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఫైనాన్స్ సెక్రటరీ) తో పాటు వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్ ఉంటారు.
జేఎన్టీయూకు మాత్రం వీరితో పాటు వర్సిటీ రెక్టార్ కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు క్లాస్ 2 కేటగిరీలో వివిధ కాలేజీలు, సంస్థల నుంచి పలువురిని తాజాగా ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. దీనిలో సీనియర్ ప్రొఫెసర్లతో పాటు ప్రైవేట్ అనుబంధ కాలేజీ నుంచి ఒకరు, వివిధ రంగాల్లోని నిపుణులను సభ్యులు నియమిస్తారు. కానీ వర్సిటీలను కోఆర్డినేట్ చేసే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రతినిధులకు ఈసారి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించలేదు.
జేఎన్టీయూలో సభ్యులు
జేఎన్ టీయూ హైదరాబాద్ ఈసీ సభ్యులుగా సీనియర్ ప్రొఫెసర్ జి.కృష్ణమోహన్ రావు, జి.నరసింహ (ప్రిన్సిపాల్, జగిత్యాల ఇంజినీరింగ్ కాలేజ్), డాక్టర్ మహమ్మద్ యూసుఫ్ అలీ, డాక్టర్ ఎం.అజిత, డాక్టర్ రాఘవ (సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్) ఎంపికయ్యారు. ఎమినెంటర్ పర్సన్స్ కేటగిరిలో డాక్టర్ ప్రకాశ్ (యూజీసీ మాజీ అడిషనల్ సెక్రటరీ), డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కతేపల్లి నవీన్ బాబు, శ్రీనివాస మూర్తికి చోటు దక్కింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈసీ సభ్యులుగా ఎమినెంట్ పర్సన్స్ కేటగిరీలో నలుగురు నియమితులయ్యారు. ఇందులో ప్రొఫెసర్ వి.నిత్యానందరావు (వీసీ, తెలుగు వర్సిటీ), బి. వేణుగోపాల్ రెడ్డి (టీ సాట్), బి. వెంకటేశ్వరరావు, డాక్టర్ రాజారావు (ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్) ఉన్నారు.
శాతవాహన వర్సిటీ (కరీంనగర్)
శాతవాహన యూనివర్సిటీ ఈసీ సభ్యులుగా డాక్టర్ మహమ్మద్ జాఫర్ జరి, డాక్టర్ ఎస్.రమాకాంత్, డాక్టర్ వి.భిక్షపతి, డాక్టర్ డి.హరిక్రాంత్, బోలిశెట్టి రజిత నియమితులయ్యారు. ఎమినెంట్ పర్సన్స్ కేటగిరిలో వంగాల మురళీ మోహన్, స్మిత కవితా ఆలేటి, వూటుకూరి రవీందర్ రెడ్డి, సిరిపురం ఈశ్వర్ ను నియమించారు.
తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్)
తెలంగాణ వర్సిటీ ఈసీ సభ్యులుగా సీనియర్ ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, డాక్టర్ ఆర్.సుధాకర్ గౌడ్, డాక్టర్ కె.సంజీవరావు, డాక్టర్ దండుస్వామి, ప్రొఫెసర్ మదన్ మోహన్ ఎంపికయ్యారు. ఎమినెంట్ కేటగిరిలో చెరుకూరి రజనీకాంత్, అల్లే లావణ్య, మహమ్మద్ ఘాజీ, డాక్టర్ ఎస్.జయంత్ ను ప్రభుత్వం నామినేట్ చేసింది.
ఓయూ ఈసీ సభ్యులు వీరే
ఉస్మానియా యూనివర్సిటీ ఈసీ సభ్యులుగా సీనియర్ ప్రొఫెసర్ పి.ఉషశ్రీ, ప్రొఫెసర్ ఎం.విజులత (ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ సైన్స్), డాక్టర్ తుములూరు శ్రీలక్ష్మి (ప్రిన్సిపాల్, గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్), బి. సుజాత నాయక్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్), డాక్టర్ జె. నీరజ (తెలుగు విభాగం) నియమితులయ్యారు. వీరితో పాటు ఎమినెంట్ పర్సన్స్ కేటగిరీలో డాక్టర్ బాణపురం మధుసూదన్ రెడ్డి (రామాయంపేట), నర్రి యాదయ్య (టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు), సూరం రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డిని ప్రభుత్వం నామినేట్ చేసింది.

