
- రాష్ట్రంలో 10,954 గ్రామాలు.. ఇప్పటికే 3,500 మంది ఎంపిక
- మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు
- పాత వీఆర్ఏ, వీఆర్వోల్లో మరికొందరికి చాన్స్
- మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్తో భర్తీకి యోచన
హైదరాబాద్, వెలుగు: గ్రామాలకు త్వరలోనే గ్రామ పరిపాలన అధికారులు (జీపీవో) రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలు ఉన్నాయి. జీపీవోల నియామకాల కోసం గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా.. అందులో 3,454 మంది అర్హత సాధించారు. వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదు. అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీవోలను నియమించాలనే ఉద్దేశంలో భాగంగానే ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది.
అయితే, తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలైన డిప్యూటీ కలెక్టర్ల యూనియన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ట్రెసా రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరఫున సీసీఎల్ఏ లోకేశ్ కుమార్ సమావేశమయ్యారు. జీపీవోల నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారుల నియామకంపై సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీవోలను నియమించాలని, కానీ.. ప్రస్తుతం 3,454 మంది మాత్రమే ఎంపికయ్యారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గుర్తు చేశారు. ఆసక్తి కలిగిన పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోలకు మరోసారి జీపీవో అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. మళ్లీ అవకాశం కల్పిస్తే ఇంకో 2,500 నుంచి 3వేల మంది జీపీవోలుగా వచ్చే చాన్స్ ఉన్నది. దీంతో దాదాపు సగం జీపీవో పోస్టులు భర్తీ అవుతాయి. మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, ఇతర అర్హత ఉన్న సిబ్బందిని ఇన్చార్జ్ జీపీవోలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020, అక్టోబర్ లో దాదాపు 22 వేలకు పైగా వీఆర్వో, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. వీరంతా ఆయా శాఖల్లో సెట్ అయ్యారు.
జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండటంతో చాలా మంది ఆ శాఖల్లోనే కంటిన్యూ కావాలని భావిస్తున్నారు. మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు వీఆర్వోలను నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లారు. ఆయా పోస్టుల్లో సీనియారిటీ, ప్రమోషన్లను దృష్టిలో ఉంచుకొని కొందరు వెనక్కి వచ్చేందుకు నో చెప్పారు. అయితే, జీపీవో రూల్స్ రావడం.. అందులో ప్రమోషన్లకు అవకాశం ఉండటంతో మళ్లీ తిరిగి గ్రామ పాలనాధికారిగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, అర్హత ఉన్నవారికే అవకాశం ఉంటుందని.. అందులో ప్రభుత్వం నిర్వహించే టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు చాన్స్ ఇవ్వాలి: డిప్యూటీ కలెక్టర్ల సంఘం
రాష్ట్రంలో గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామకాల ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నదని రెవెన్యూ జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తెలిపారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు సైతం జీపీవోలుగా అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. మిగిలిన జీపీవో పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరాయి. వీఆర్ఏలను ఇతర డిపార్ట్‌మెంట్లలో సర్దుబాటు చేసే బదులు, మృతి చెందిన వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపిన పూర్వ వీఆర్ఏలను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేశ్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి పాల్గొన్నారు.
స్పౌజ్.. మెడికల్ గ్రౌండ్స్ బదిలీలకు ఓకే: ట్రెసా
ఎంపికైన జీపీవోలకు నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని సీసీఏల్ఏ లోకేశ్ కుమార్ తెలియజేశారని.. ట్రెసా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతం కుమార్ తెలిపారు. స్పౌజ్ మెడికల్ గ్రౌండ్స్ బదిలీలను అంగీకరిస్తూ మిగతా వారిని.. వారి సొంత జిల్లాలకు కేటాయించాలనే విజ్ఞప్తికి కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. పనిఒత్తిడి బట్టి కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లతో కూడా భూ భారతి సదస్సుల దరఖాస్తులను ఎంక్వైరీ చేయించడానికి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తామని లోకేశ్ కుమార్ తెలియజేశారు.