V6 News

ఇక సర్కారు మెట్రో.. ఎల్‌‌ అండ్‌‌ టీ నుంచి 100 శాతం షేర్ల బదిలీ పూర్తి

ఇక సర్కారు  మెట్రో.. ఎల్‌‌ అండ్‌‌ టీ నుంచి 100 శాతం షేర్ల బదిలీ పూర్తి
  • సెక్రటేరియెట్​లో రూ.1,461 కోట్ల షేర్ల కొనుగోలు పత్రాల మార్పిడి
  • మెట్రో ఫేజ్​-1 పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి..
  • మెట్రో ఫేజ్‌‌–2కు లైన్‌‌ క్లియర్‌‌
  • త్వరలోనే కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు: భాగ్యనగర రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర  ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు ఎల్ అండ్ టీ సంస్థకు సంబంధించిన వంద శాతం షేర్లను కొనుగోలు చేస్తరాష్ట్ర సర్కారు బుధవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ చారిత్రాత్మక నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయి, ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. మెట్రో ఫేజ్-2 కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు సాధించే దిశగా ఇది కీలక చర్యగా భావిస్తున్నారు. మొత్తం 100 శాతం షేర్ల బదిలీతో నిర్వహణ, ప్రణాళిక అంతా ఇకపై ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగనుంది. త్వరలోనే కేంద్రానికి లేఖ రాయడం ద్వారా మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

రూ.13,583 కోట్ల రుణాలకు ప్రభుత్వమే రీఫైనాన్స్​
సెక్రటేరియెట్​లో బుధవారం జరిగిన ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థకు ఉన్న 100శాతం షేర్లను రూ. 1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంపై హెచ్‌‌ఎంఆర్‌‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రస్తుతం మెట్రో సంస్థపై ఉన్న సుమారు రూ. 13,538.53 కోట్ల భారీ రుణాన్ని 2026 ఏప్రిల్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం తన హామీతో రీఫైనాన్స్ చేస్తుంది. దీంతో ఆర్థికంగా మెట్రోకు వెసులుబాటు కలగనుంది.

2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదైన ఈ నెట్‌‌వర్క్​ను ఇకపై ‘మెట్రో రైల్ లిమిటెడ్’ నేరుగా పర్యవేక్షిస్తుంది. ఈ బదిలీ ప్రక్రియలో ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌‌గా వ్యవహరించగా, లీగల్ అంశాలను సరాఫ్ అండ్ పార్ట్‌‌నర్స్ చూసుకున్నాయి. పీపీపీ మోడ్ నుంచి ప్రభుత్వ రంగంలోకి మారడంతో మెట్రో భవిష్యత్తు  మలుపు తిరిగింది. ఈ ఒప్పందం కంటే ముందు సీఎం ఎ.రేవంత్ రెడ్డిని ఎల్ అండ్ టీ ఛైర్మన్‌‌, ఎండీ ఎస్‌‌.ఎన్‌‌.సుబ్రహ్మణ్యన్ మ‌‌ర్యాద‌‌పూర్వకంగా కలిశారు. 

విస్తరణకు కేంద్రం షరతు.. గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన రాష్ట్ర సర్కార్​
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా  చేపట్టాలని నిర్ణయించాయి. కానీ ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక షరతు విధించింది. రెండో దశ విస్తరణ సజావుగా సాగాలంటే, ప్రస్తుతం నడుస్తున్న మొదటి దశ కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని సూచించింది.

రెండు దశల మధ్య ఛార్జీల నిర్ణయం, సాంకేతిక సమన్వయం, ఆస్తుల నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే పూర్తి ప్రాజెక్టు ఒకే గొడుగు కిందికి రావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ నుంచి ఫేజ్-1ను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఇప్పటికే పంపిన డీపీఆర్‌‌లకు కేంద్రం ఆమోదం తెలిపితే, ఫేజ్-2కు అవసరమైన నిధుల్లో కేంద్రం వాటా దక్కే అవకాశం ఉంది.

మెట్రో ఫేజ్-2 విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మొత్తం రూ. 43,848 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇందులో కేటగిరీ 'ఏ' కింద ఐదు కారిడార్లు, కేటగిరీ 'బీ' కింద మరో మూడు కారిడార్లను మొత్తం 162.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భారీ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 18 శాతం నిధులు అంటే దాదాపు రూ. 7,892 కోట్లు రానున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30 శాతం అంటే రూ. 13,154 కోట్లు భరించాలని నిర్ణయించింది. మిగిలిన నిధుల్లో 48 శాతం అంటే రూ. 21,091 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రుణంగా సేకరిస్తారు. ఫేజ్-1ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ భారీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది.