హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు 2026 ఆగస్టు నాటికి అన్ని ప్రభుత్వ బడుల్లో సైన్స్ ల్యాబ్‌లు, హైస్కూళ్లకు టీ-ఫైబర్ లేదా బీఎస్ఎన్ఎల్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల (ఏటీఎల్) పనితీరుపై జిల్లా సైన్స్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. స్టూడెంట్లకు క్వాలిటీ సైన్స్ ఎడ్యుకేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో సైన్స్ ఎడ్యుకేషన్, ఐసీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాబ్‌ల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని, విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందేలా చూడాలని సూచించారు. ప్రతి డీఎస్ఓ తన పరిధిలోని ల్యాబ్‌లను వ్యక్తిగతంగా సందర్శించి, అవి పూర్తిస్థాయిలో పని చేసేలా చూడాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో సైన్స్ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రతి డీఎస్ఓకు రూ.50 వేల ఆపరేషనల్ ఫండ్ కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సైన్స్ విద్యలో ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన టీచర్లను, డీఎస్ఓలను రెండు నెలల్లోపు పుణెకు పంపిస్తామని తెలిపారు.
