హ్యామ్ రోడ్ల టెండర్లలో ఆరోపణలు అవాస్తవం..మన కన్నా మిగిలిన రాష్ట్రాల్లోనే ఎక్సెస్ టెండర్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హ్యామ్ రోడ్ల టెండర్లలో ఆరోపణలు అవాస్తవం..మన కన్నా మిగిలిన రాష్ట్రాల్లోనే ఎక్సెస్ టెండర్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • పారదర్శకంగానే బిడ్లను ఆహ్వానించాం
  • మంత్రికి వివరించిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: హ్యామ్ రోడ్ల టెండర్లలో ఎక్సెస్ రేట్లు అన్న ఆరోపణలు అవాస్తవమని, ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే ఎక్సెస్ తక్కువగా ఉందని అధికారులు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డికి వివరించారు. హ్యామ్ రోడ్ల పురోగతిపై మంత్రి వెంకట్ రెడ్డి సోమవారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ చేశారు. ఎక్సెస్ టెండర్లు అన్న విమర్శల గురించి మంత్రి అధికారులను ప్రశ్నించారు.

హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గరే తక్కువ రేట్లు కోట్ చేసినట్టు అధికారులు లెక్కలతో సహా మంత్రికి వివరించారు. ముందుగానే టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించినట్టు, ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ నమూనాలోనే ఆర్ ఈ పీ, డీసీఏ డాక్యుమెంట్లు రూపొందించి పారదర్శకంగా టెండర్లకు ఆహ్వానించినట్లు చెప్పారు. టెండర్లు పిలిచినప్పుడు బిటుమెన్ (నల్ల తారు) ధర మెట్రిక్ టన్నుకు రూ.44 వేలు ఉండగా, ఇప్పుడు రూ.89 వేలు అయ్యిందని వివరించారు. 

మౌలిక వసతుల అభివృద్ధికే హ్యామ్ విధానం.. 

రోడ్లు అభివృద్ధి జరిగితే పరిశ్రమలు ఏర్పాటవుతాయని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. హ్యామ్ విధానంలో 2016 నుంచి ఇప్పటివరకు 374కు పైగా ప్రాజెక్టులు చేపట్టారని, రూ.5 లక్షల కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలోనూ ఫేజ్-1 కింద ఆర్ అండ్ బీ ద్వారా రూ.13,006.27 కోట్లతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 34 ప్యాకేజీలుగా మొత్తం 6,092.37 కిలోమీటర్ల రోడ్లను చేపట్టామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.6,250 కోట్లతో 2,162 రోడ్లు నిర్మిస్తున్నామని, 17 ప్యాకేజీలుగా 7,450 కిలోమీటర్ల రోడ్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో మెషినరీ వినియోగం ఎక్కువ కావడం, ఆధునిక డిజైన్లు, సర్వేలు, 15 ఏండ్ల మెయింటనెన్స్ బాధ్యత జీఎస్టీ, వడ్డీ భారం వంటి అదనపు ఖర్చులు ఉంటాయన్నారు. జీఎస్టీ, వడ్డీతో 9.30 శాతం అదనపు భారం పడుతోందన్నారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో 66, మహారాష్ట్రలో 47 శాతం ఎక్సెస్ పాజిటివ్ బిడ్లు వేశారని చెప్పారు. ఇంధనం, స్టీల్, సిమెంట్ రేట్లు పెరిగాయని, బిటుమెన్ రేటు రెట్టింపు అయ్యిందని మంత్రి తెలిపారు. దీంతో ప్రాజెక్టు కాస్ట్ 20 నుంచి 25 శాతం పెరుగుతోందన్నారు. రెండ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ వివరాలన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ బీవీ రావు, ఇంజినీర్లు పాల్గొన్నారు.