- వైద్య శాఖలో 4,869 మంది ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్
- తొలివిడతలో 157 కేడర్లలో బదిలీలు పూర్తి
- రెండో విడతలో 3 నుంచి 4 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి చాన్స్
- ఉద్యోగుల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్‌ఓడీలకు
- ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన తొలి విడత బదిలీల ప్రక్రియ ముగిసింది. మొత్తం 157 కేడర్లలో 4,869 మంది ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆసుపత్రుల్లో సిబ్బంది సమతుల్యత దెబ్బతినకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బదిలీ అయిన వారిలో అత్యధికంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలోనే 2,258 మంది ఉన్నారు. వివిధ విభాగాల్లోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించారు. చాలా కాలంగా హైదరాబాద్ వంటి సిటీల్లోనే తిష్టవేసిన వారిని జిల్లాలకు పంపగా, జిల్లాల్లోనే పనిచేస్తున్న వారికి హైదరాబాద్ వచ్చే అవకాశం లభించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల కొరత తీరడంతో పాటు, సిటీ ఆసుపత్రులపై పేషెంట్ల భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
3 నుంచి 4 ఏళ్ల సర్వీసు ఉన్నవారి వివరాలివ్వండి..
ట్రాన్స్‌ఫర్స్‌లో భాగంగా రెండో విడత బదిలీల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుత స్థానాల్లో 3 నుంచి 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల నుంచి అందిన అభ్యర్థనలను పరిశీలించేందుకు సిద్ధమైంది. క్యాడర్ల వారీగా ఉన్న ఖాళీలు, బదిలీల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య, బదిలీల వల్ల కలిగే ఇబ్బందులు వంటి పూర్తి సమాచారాన్ని శుక్రవారం లోపు పంపించాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్
సెక్రటరీ అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్ సహా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా, ఖాళీలను బట్టి అర్హులైన వారికి బదిలీలు కల్పించేలా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
