హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనుమతి లేకుండా, తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న ఆయుర్వేద, హోమియోపతి క్లినిక్ లపై ఫోకస్ పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ లో ఆయుష్ వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత లేని వ్యక్తులు క్లినిక్ లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబుకు సూచించారు. ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీలకు సరిగా రాని, అటెండెన్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిద్దిపేట, వికారాబాద్, భూపాలపల్లిలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటళ్లను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

