- వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
- ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ఆస్పత్రులకు పేషెంట్లు రావాల్సిన అవసరం లేదు
- సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎంజీఎం వంటి ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన పేషెంట్లు ఇకపై ఫాలోఅప్ ట్రీట్ మెంట్ కోసం మళ్లీ సిటీకి రావాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లోనే ఫాలోఅప్ ట్రీట్మెంట్ పొందాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లోనే ఫాలోఅప్ ట్రీట్మెంట్ పొందడం వల్ల పేషెంట్లపై రవాణా ఖర్చుల భారం తగ్గడమే కాకుండా సర్కారు దవాఖానలపై నమ్మకం పెరుగుతుందన్నారు.
ఇందుకు అనుగుణంగా సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటికి సమీపంలోనే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్) ప్రకారం తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
రెండేండ్లలో వైద్యశాఖలో 12,649 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. డాక్టర్లతోపాటు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీవీవీపీ కమిషనర్ ను ఆదేశించారు. ఎండాకాలం దృష్ట్యా ఆస్పత్రుల్లో ఏసీలు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

