V6 News

ఎన్ హెచ్ 563 భూ సేకరణకూ 2013 చట్టం వర్తింపు : హైకోర్టు

ఎన్ హెచ్ 563 భూ సేకరణకూ 2013 చట్టం వర్తింపు : హైకోర్టు
  •     సింగిల్​జడ్జి తీర్పును రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: జాతీయ రహదారుల నిర్మాణానికి 1956 భూసేకరణ చట్టం కింద భూ సేకరణ చేపట్టినప్పటికీ 2013 చట్టంలో భాగంగా పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద ప్రయోజనాలు కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. కరీంనగర్‌‌–-వరంగల్‌‌ ఎన్‌‌హెచ్‌‌ 563 భూ నిర్వాసితుల దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌‌హెచ్‌‌ 563 భూ సేకరణ ప్రక్రియలో పునరావాస, పునర్నిర్మాణ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్​చేస్తూ హనుమకొండ జిల్లా ఎలకుర్తి మండలం సూరారం గ్రామానికి చెంది ఎస్కే. సాబీర్‌‌, మరో 11 మంది 2023లో హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. 

విచారణ జరిపిన సింగిల్‌‌ జడ్జి ఆ పిటిషన్‌‌ను కొట్టివేశారు. తర్వాత సాబీర్‌‌ మరో ఇద్దరు మళ్లీ అప్పీల్​చేశారు. చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం.మొహియుద్దీన్‌‌లతో కూడిన బెంచ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది రవికుమార్‌‌ వాదనలు వినిపిస్తూ.. 1956 భూసేకరణ చట్టం కింద భూసేకరణ చేసినప్పటికీ 2013 చట్టం కింద పునరాస పథకాన్ని అమలు చేయాలన్నారు. 

ఈ విషయమై కేంద్రం 2015 లోనే మార్గదర్శకాలు జారీ చేసినా ఆచరణలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. వాదనలను విన్న బెంచ్‌‌1956 చట్టం సెక్షన్‌‌ 3జి(5) కింద ప్రత్యామ్నాయం ఉందని, సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని చెప్పింది. ఎందుకంటే పునరావాసం పథకం కింద ఎలాంటి అవార్డు ప్రకటించలేదని పేర్కొంది. సింగిల్‌‌ జడ్జి తీర్పును రద్దు చేసి, పునరావాస పథకం అమలు చేయాలని కోరుతూ బాధితులు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలని తీర్పు వెలువరించింది.