ఊకుంటే ఎన్నికల..ర్యాలీకి కూడా పోతరేమో!

ఊకుంటే ఎన్నికల..ర్యాలీకి కూడా పోతరేమో!
  • మంత్రితో తిరుమల వెళ్లిన టూరిజం ఎండీ తీరుపై హైకోర్టు వ్యాఖ్య
  • సస్పెన్షన్​పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన తర్వాత కూడా పదవిలో కొనసాగేందుకు అనుమతిస్తే.. రాష్ట్ర టూరిజం ఎండీ ఎన్నికల ర్యాలీల్లో కూడా పాల్గొంటారేమోనని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈసీ విధించిన సస్పెన్షన్​పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరిచింది.  ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా మంత్రితో కలిసి తిరుమల వెళ్లారన్న ఫిర్యాదుతో ఈసీ సస్పెన్షన్‌కు గురైన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోయిన్‌పల్లి మనోహర్‌రావుకు హైకోర్టులో ఊరట లభించలేదు. అక్టోబర్​ 15న ఆయన తిరుమల పర్యటనకు సంబంధించిన రికార్డును మూడ్రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి శుక్రవారం నోటీసులిచ్చింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లారనే ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం అధికారులు మనోహర్‌ రావును సస్పెండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో అధికారులు  ప్రోటోకాల్‌కు దూరంగా ఉండాలన్న నిబంధనను మనోహర్​రావు ఉల్లంఘించారని , దీంతో వెంటనే ఆయనను సస్పెండ్‌ చేయాలని సీఎస్​ను ఆదేశించింది. ఈ చర్యను ఎండీ మనోహర్‌రావు హైకోర్టులో సవాల్‌ చేశారు. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్‌ల బెంచ్‌ శుక్రవారం విచారించింది. 

సీనియర్‌ న్యాయవాది పి.రఘురామ్‌ వాదిస్తూ.. మంత్రి కోసం పిటిషనర్‌ ప్రొటోకాల్‌ పాటించలేదన్నారు. కార్పొరేషన్‌కు మంజూరు చేసిన రోజువారీ దర్శన టికెట్ల కోటాను ప్రస్తుత 300 నుంచి 500 టికెట్‌లకు పెంచాలని టీటీడీని కోరేందుకే పిటిషనర్‌ తిరుమల వెళ్లారని వివరించారు. టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. ఈసీ అధికారులు సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. హైకోర్టు స్పందిస్తూ, మోడల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన తర్వాత కూడా ఎండీగా ఆయనను ఆ పదవిలో కొనసాగించడానికి అనుమతిస్తే.. ఆ తర్వాత ఎన్నికల ర్యాలీల్లో కూడా పాల్గొనే చాన్స్​ ఉంటుందని వ్యాఖ్యానించింది. టీటీడీ అధికారులతో సమావేశానికి హాజరైనదీ లేనిదీ తేల్చేందుకు సంబంధిత రికార్డులను సమర్పించాలని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది.