V6 News

గురుకులాలకు టెస్కో ద్వారానే వస్త్రాలు సేకరించాలి : హైకోర్టు

గురుకులాలకు టెస్కో ద్వారానే వస్త్రాలు సేకరించాలి : హైకోర్టు
  • ఎన్వోసీ లేకుండా టెండర్ వేయడం చట్టవిరుద్ధం
  • వరంగల్ చేనేత సంఘం పిటిషన్‌‌‌‌పై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు సహా అన్ని ప్రభుత్వ సంస్థలు తమకు కావలసిన దుస్తులు, బెడ్‌‌‌‌షీట్లు, కార్పెట్లు వంటి వస్త్రాలను కచ్చితంగా  టెస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ద్వారానే సేకరించాలని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలలకు కార్పెట్లు, బ్లాంకెట్లు, దుస్తుల సరఫరా కోసం ఈ నెల 2న ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) జారీ చేసిన -టెండర్ నోటిఫికేషన్‌‌‌‌ను హైకోర్టు రద్దు చేసింది.

గురుకుల విద్యార్థులకు కావాల్సిన బట్టలను సరఫరా చేసే పనిని ప్రభుత్వం ఒక ప్రైవేటు టెండర్ ద్వారా వేరే వాళ్లకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఈనెల 2న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, వరంగల్ జిల్లా కొత్వాడలోని వీరాంజనేయ చేనేత సహకార సంఘం వారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్స్ ప్రకారం.. ఈ పని చేనేత కార్మికులకే (టెస్కో ద్వారా) ఇవ్వాలని..కానీ ప్రభుత్వం బయట వ్యక్తులకు ఇచ్చిందని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ జూకంటి అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ విచారణ చేపట్టారు. చేనేత సంఘం తరపు అడ్వకేట్ వాదిస్తూ..ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 ప్రకారం వస్త్రాలన్నీ టెస్కో నుంచే కొనాలని, కానీ అధికారులు నిబంధనలు అతిక్రమించి ప్రైవేటు టెండర్లు పిలిచి నేతన్నలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.

తమ దగ్గర సరకు లేదని టెస్కో సంస్థ ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) ఇవ్వకుండానే.. అధికారులు నేరుగా బయట మార్కెట్‌‌‌‌లో టెండర్లు పిలవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.ప్రభుత్వం వాదిస్తూ...విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున సమయాభావం వల్లే టెండర్లు పిలిచామని.. నాణ్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంది. ఇరుపక్షాల వాదనలపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ స్పందిస్తూ.. జీవో 1 చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కవచమని వ్యాఖ్యానించారు. టెస్కో లేఖ లేకుండా ప్రైవేటు టెండర్లు పిలవడం చెల్లదని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్‌‌‌‌ను రద్దు చేశారు.