బహ దూర్‌‌‌‌గూడ భూముల్లోకి వెళ్లొద్దు...హైడ్రాకు హైకోర్టు ఆదేశం

బహ దూర్‌‌‌‌గూడ భూముల్లోకి వెళ్లొద్దు...హైడ్రాకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌ మండలం బహదూర్‌‌‌‌గూడ వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ హైడ్రాతో పాటు అధికారులకు హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితి కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఆ భూముల్లో జోక్యం చేసుకోవడం, స్వాధీనం చేసుకోవడం చేయరాదని తేల్చి చెప్పింది. హైడ్రా, పోలీసులు, రెవెన్యూ అధికారులు బహదూర్‌‌‌‌గూడ భూముల్లోని ఇండ్లను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆర్‌‌‌‌.కృష్ణమోహన్‌‌‌‌ రాజు మరో 84 మందితో పాటు తమకు చెందిన 49 ఎకరాల్లో జోక్యం చేసుకోవడంపై ముస్తాగ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రా ప్రాజెక్ట్స్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ వేర్వేరుగా రెండు పిటిషన్‌‌‌‌లు దాఖలు చేశాయి. 

వీటిపై జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు అమానవీయంగా దాడులు నిర్వహించారన్నారు. పిటిషనర్లతో పాటు పలువురు రైతులను, మహిళలను అక్రమంగా నిర్బంధించారన్నారు. ఆస్తి నష్టాన్ని కలిగించి, మానసిక ఆందోళనకు గురి చేసినందుకు రూ.2 కోట్ల పరిహారం ఇప్పించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.  వాదనలను విన్న న్యాయమూర్తి.. జులై 21నాటి ఉత్తర్వుల నేపథ్యంలో సర్వే నం.28, 62, సర్వే నం.37, 39 నుంచి 42, 54లో ఉన్న భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.