ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అనుమానంతోనే పిటిషన్లు: హైకోర్టులో TGPSC వాదన

ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అనుమానంతోనే పిటిషన్లు: హైకోర్టులో TGPSC వాదన

టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. గురువారం (  జులై 3 ) విచారణ సందర్భంగా కీలక వాదనలు వినిపించారు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదని.. నామినల్‌ రోల్స్‌, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవమని తెలిపారు.అక్కడ ఉన్న రెండు పరీక్ష కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాశారని.. మిగతా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయ్యారని అన్నారు. 

ALSO READ | ఐటీనే కాదు.. బంగారం అన్నా ఇక హైదరాబాద్ సిటీనే : సీఎం రేవంత్ రెడ్డి

 కోఠిలోని రెండు కేంద్రాలను కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని..ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారని అన్నారు.అభ్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని.. కేవలం అపోహలు మాత్రమేనని అన్నారు. గ్రూప్‌ 1కు ఎంపికైన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం కాగా.. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ  మీడియం 0.1 శాతంగా ఉన్నారుని వెల్లడించింది టీజీపీఎస్సీ.

APలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నరని.. టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియం లో అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేసింది. అందరికీ ఎక్స్ప్ ర్ట్ ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేసినట్లు హైకోర్టుకు తెలిపింది టీజీపీఎస్సీ. ఈ క్రమంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.