స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ బకాయిలపై హైకోర్టు విచారణ

స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ బకాయిలపై హైకోర్టు విచారణ
  • సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌‌కు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ నిధుల విడుదల వ్యవహారంలో సంబంధిత ప్రభుత్వ శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌‌కు హైకోర్టు సూచించింది. ఉన్నత విద్యామండలి, మైనారిటీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చాలని పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ 'అసీమ్' (అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనమిక్ ఎంపవర్‌‌మెంట్ ఆఫ్ ది మార్జినలైజ్డ్), 'స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్' సంస్థలు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాయి.

దీనిపై చీఫ్ జస్టిస్ అలియాస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్కాలర్‌‌షిప్ బకాయిలను ఏ మేరకు విడుదల చేశారో ప్రభుత్వం వెల్లడించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌షిప్ బకాయిల ఉండడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వడం లేదని తెలిపారు.

ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. బకాయిల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయరాదని కళాశాలలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించామని, ఇందులో ఇంకా రూ.125 కోట్ల బకాయిలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

వివిధ శాఖల పరిధిలో కళాశాలలు ఉన్నందున ఉన్నత విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం అవి ఈ కేసులో ప్రతివాదులుగా లేవని ధర్మాసనం పేర్కొంది. అందుకే ఆయా శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.