ఈ సీజన్ లో 50లక్షల వడ్లు కొన్నాం

ఈ సీజన్ లో 50లక్షల వడ్లు కొన్నాం
  •     50 లక్షల టన్నులు కొనుగోలు చేసినం: గంగుల 
  •     ఎఫ్​సీఐ టార్గెట్ కు దగ్గర్లో ఉన్నం 
  •     కొనుగోళ్లు పూర్తయిన 1982 సెంటర్లను మూసేసినమని వెల్లడి 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశామని సివిల్‌ సప్లయ్స్‌ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 50 లక్షల టన్నులు కొన్నామని తెలిపారు. వానాకాలం సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ అని, ఆల్ టైమ్ రికార్డు సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా 20 శాతం కోతలు మిగిలి ఉండగానే, ఇంత పెద్ద ఎత్తున వడ్లు కొన్నామన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,846 కొనుగోలు సెంటర్లు పెట్టి, వడ్లు కొంటున్నామని గంగుల తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి కావడంతో 1,982 సెంటర్లను మూసివేశామని చెప్పారు. నిజమాబాద్ లో -424, మెదక్ 375, కామారెడ్డి 287, కరీంనగర్ 283, సంగారెడ్డి 142, రాజన్న సిరిసిల్ల 117, సూర్యాపేట 22, నల్గొండ 23, మేడ్చల్ మల్కాజిగిరి 1, పెద్దపల్లి 52, జగిత్యాల 96, యాదాద్రి భువనగిరి 19, నిర్మల్ 68, సిద్దిపేటలో 73 కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్టు పేర్కొన్నారు. 

ఇయ్యాల సీఎంతో భేటీ... 
రాష్ట్రంలో 59.60 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఎఫ్ సీఐ అనుమతి ఇచ్చిందని గంగుల చెప్పారు. అయితే ఇంకో 40 లక్షల టన్నులు వడ్లు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని, వాటిని ఎలా కొనుగోలు చేయాలనే దానిపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. శుక్రవారం కేసీఆర్ తో సమావేశమై స్పష్టత కోరతామన్నారు. రాష్ట్ర సర్కార్ రైతు అనుకూల విధానాలు, కాళేశ్వరంతో పుష్కలంగా నీళ్లు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేయడంతో దిగుబడి బాగా పెరిగిందన్నారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు.