మెదక్ జిల్లాలో కుక్కల దాడిలో చనిపోయిన బాబు ఫ్యామిలీకి రూ.5 లక్షలివ్వండి

మెదక్ జిల్లాలో కుక్కల దాడిలో చనిపోయిన బాబు ఫ్యామిలీకి రూ.5 లక్షలివ్వండి
  • మెదక్​ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సిఫార్సు

అబిడ్స్, వెలుగు: మెదక్​ జిల్లాలో వీధికుక్కల దాడిలో మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. మృతుడి తల్లిదండ్రులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్‌ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో 2025 జూలై 18న నితున్‌ పవార్‌పై వీధికుక్కల గుంపు దాడి చేయడంతో మృతి చెందాడు. బర్త్​డే మరుసటి రోజే బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కమిషన్‌ పేర్కొంది. వీధికుక్కల దాడులను అరికట్టడంలో  జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులు విఫలమయ్యారని కమిషన్‌ వ్యాఖ్యానించింది. 

ముందస్తు చర్యలు తీసుకుంటే ఘటనను నివారించే అవకాశం ఉండేదని పేర్కొంది. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, లోపాలు ఉన్నాయని తెలిపింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్‌ 18 కింద అధికారాలను వినియోగిస్తూ మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు జర్పుల హోబ్యా, జర్పుల లావణ్యకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్‌ సిఫారసు చేస్తూ, ఉత్తర్వులు అందిన 3 నెలల్లోగా పరిహారం చెల్లించాలని సూచించింది. 2020 నుంచి 2025 వరకు రాష్ట్రంలో వీధికుక్కల కాట్లు, దాడుల కారణంగా సంభవించిన మరణాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.