
నలుగురు సీనియర్ ఐఏఎస్‌ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము చెప్పిందానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్అధికారులు.. ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్చేసుకొని వేధిస్తున్నారనే టాక్సెక్రటేరియెట్వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బిహార్, యూపీ ఐఏఎస్‌లు పాలనా వ్యవహారాల్లో అన్నీ తామై చక్రం తిప్పగా.. తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు ప్రాధాన్య పోస్టులు దక్కినా.. క్రమంగా అవమానాలు, ఆకస్మాత్తు బదిలీలు, అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్లు తెలిసింది. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ అధికారులకు ప్రయారిటీ దక్కట్లే..
కాంగ్రెస్ సర్కార్ సైతం అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారులకే పెద్దపీట వేస్తుండడంతో తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య పోస్టులే దక్కుతున్నాయనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో కొందరు తెలంగాణఐఏఎస్లకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చారు. వారు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెడ్తూ వచ్చారు. ఏమైందో ఏమో క్రమంగా ఒక్కొక్కరిని మారుస్తూ పోతున్నారు. ఉదాహరణకు సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది.
ఆయనకు మరో ఐదేండ్లకు పైగా సర్వీస్ ఉండగానే టీజీపీఎస్సీ చైర్మన్‌గా పంపడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, ప్రభుత్వం వచ్చాక ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేయడం గమనార్హం. కీలకమైన మిస్‌వరల్డ్ పోటీలు జరుగుతున్న తరుణంలో ఆ బాధ్యతలు చూస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కారణం లేకుండా పక్కనపెట్టి, ఓ జూనియర్‌కు బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యపరిచింది.
అదే విధంగా తెలంగాణకే చెందిన ఒక ఐఏఎస్ అధికారికి తొలుత ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చి, ఆ తర్వాత ప్రాధాన్యం లేని మరో పోస్టుకు బదిలీ చేయడం కూడా ఇలాంటిదే! 2011 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ హోదాలోనే కొనసాగుతుండగా, ఆమె కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారికి కమిషనర్ పదవి ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వంలోనూ ఇలాగే బిహార్, యూపీకి చెందిన అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కగా, ఇప్పుడు వారికి తమిళనాడు వారు తోడయ్యారని, తెలంగాణ వారికి అప్పుడు ఇప్పుడు ప్రయారిటీ దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.