- రాష్ట్రవ్యాప్తంగా 1,213 పోస్టులు ఖాళీ
- 15వ తేదీలోగా ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి 15వ తేదీలోగా ఆప్షన్ ఫారాలు అందజేయాలని జిల్లా అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రస్తుత స్థానంలో మూడేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ పరిధిలోకి వచ్చేవారు, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు బదిలీ కోరుకునేవారు, వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీ కావాలనుకునేవారు తమ ఆప్షన్లను తెలియజేయవచ్చు. కాగా, అర్హులైన పంచాయతీ కార్యదర్శుల నుంచి నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులు స్వీకరించి, ధ్రువీకరించాక 15వ తేదీ సాయంత్రంలోపు కమిషనర్ కార్యాలయానికి పంపాలని సూచించింది.
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 85 పోస్టులు ఖాళీ
రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా.. 2026 మే ఒకటి నాటికి 1,213 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 85 పోస్టులు ఉండగా.. కుమ్రంభీం జిల్లాలో 78, కామారెడ్డిలో 68, జనగామ 64 ఖాళీలు ఉన్నాయి. అత్యల్పంగా సంగారెడ్డిలో 12, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల జిల్లాలో 14 చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అసలు గ్రామ పంచాయతీలే లేకపోయినా... ఇక్కడ 18 ఖాళీలు చూపడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే జోన్లవారీగా ఖాళీల వివరాలను సైతం ప్రకటించింది. కాళేశ్వరం జోన్‌లో 208, బాసర జోన్‌లో 126, రాజన్న సిరిసిల్ల జోన్‌లో 216, భద్రాద్రి జోన్‌లో 164, యాదాద్రి జోన్‌లో అత్యధికంగా 258 ఖాళీలు ఉన్నాయి. చార్మినార్ జోన్‌లో అత్యల్పంగా 81 ఖాళీలు, జోగులాంబ జోన్‌లో 160 ఖాళీలు ఉన్నాయి.
