తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారబోతున్నదని సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ మార్చే దారిదీపంలా తమ పార్టీ ఉండబోతుందని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా సర్వజనుల్లో కొత్త వెలుగులు నింపేలా సర్వోదయ తెలంగాణ కోసం పార్టీ పనిచేస్తుందన్నారు.
గొప్ప మార్పు లక్ష్యంగా ఏర్పాటు చేయబోయే పార్టీలో మహిళలు, యూత్‌కు పెద్దపీట వేస్తామని కవిత తెలిపారు. తెలంగాణ తొలి, మలిదశ ‘ఉద్యమకారుల అనుభవాలు, కొత్త, పాత కలయికతో పార్టీ నిర్మించబోతున్నం. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా వరకు మాతో టచ్‌లో ఉన్నరు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం నాతో చేతులు కలపాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్న. ఇన్నాళ్లూ నన్ను విమర్శించిన వారికైనా సరే ఆహ్వానం పలుకుతున్న’ అంటూ కవిత పిలుపునిచ్చారు. పాలిటిక్స్‌లో ఇగోకు స్థానం ఉండరాదన్నారు. రాజకీయాలు రాకెట్‌సైన్స్ కాదని, ప్రజల జీవితాలు మార్చే పాలిటిక్స్‌లోకి అందరూ అడుగుపెట్టాలని సూచించారు.
ప్రతిపక్షంలో ఉంటే క్రిటిసిజం.. తర్వాత ఎస్కేపిజం
రాష్ట్రంలోని పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రిటిసిజంతో ప్రజల దృష్టిని ఆకర్షించి, అధికారంలోకి వచ్చాక ఎస్కేపిజం సూత్రాన్ని పాటిస్తున్నాయని కవిత ఎద్దేవా చేశారు. ఫలానా అని కాకుండా నేతలందరి తీరు ఇట్లనే మారిందన్నారు. తమనెవరు ప్రశ్నిస్తారనే ధీమా వారిలో పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని, మన జీవితాలను శాసించే రాజకీయాల్లోకి అందరూ రావాలని సూచించారు. ఢిల్లీలో లాబీయింగ్ఎట్ల చేయాలో తెలిసి న నాకు గల్లీలో కష్టపడి పనిచేయడం కూడా తెలుసని, ఎంపీగా పనిచేయడం వల్ల నాకు దేశవ్యాప్త పరిచయాలు ఏర్పడ్డాయని కవిత తెలిపారు
