‘వాహన్’ పోర్టల్‌‌‌‌లోకి తెలంగాణ...ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

‘వాహన్’ పోర్టల్‌‌‌‌లోకి తెలంగాణ...ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  •     పోర్టల్ తో జాతీయ డేటాబేస్ లో రాష్ట్రంలోని వెహికల్స్ సమాచారం
  •     రెండో వాహనానికి 2 శాతం అదనపు లైఫ్ టాక్స్ ఎత్తివేస్తూ మంత్రి ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టల్ ‘వాహన్’తో రాష్ట్ర రవాణా శాఖ అనుసంధానమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం హైదరాబాద్​బేగంపేటలోని ఓ షోరూం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు.

ఈ పోర్టల్ లో  తెలంగాణ చేరడంతో జాతీయ డేటాబేస్ లో మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని వాహనాల సమాచారం ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వెహికల్స్ రిజిస్ట్రేషన్, యజమాని పేరు మార్పిడి, వాహనాల పన్నుల చెల్లింపులు, ఇతర ఆన్ లైన్ సేవలన్నీ ఈ పోర్టల్​ద్వారా వాహనాదారులకు పారదర్శకంగా, వేగంగా అందనున్నాయని చెప్పారు. పోర్టల్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రత, భవిష్యత్ ప్రణాళికల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

‘సారథి’తోపాటు ‘వాహన్’​ పోర్టల్ లో చేరడంతో రాష్ట్ర రవాణా శాఖలో 100 శాతం ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నేటి నుంచే రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఇప్పటివరకు ఉన్న 2 శాతం అదనపు లైఫ్ టాక్స్ ను ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక నుంచి ప్రభుత్వం తరఫున వినియోగించే ప్రతి వెహికల్ ఈవీనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేశ్, శివ లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.