హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కేజీబీవీలవిద్యార్థినులు శుక్రవారం హైదరాబాద్‌లోని అమెజాన్ ఆఫీసులో సందడి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్‌పై జామ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్’లో భాగంగా 50 మంది విద్యార్థినులు ఈ అవకాశాన్ని దక్కించున్నారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థినులకు రోబోటిక్స్‌పై ప్రత్యేక హ్యాండ్స్- ఆన్ వర్క్‌షాప్ నిర్వహించారు. విద్యార్థినులు సొంతంగా చిన్నచిన్న రోబోలను అసెంబుల్ చేసి, పరీక్షించి చూశారు.
అమెజాన్ ఉద్యోగులతో విద్యార్థినులు నేరుగా సంభాషించారు. టెక్నాలజీ రంగంలో కెరీర్ ఎలా ఉంటుంది.. రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో టెక్నాలజీ పాత్ర ఏంటి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ బోధనకు వాస్తవ ప్రపంచంతో అనుసంధానించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
