చనిపోయినవారి పింఛన్ల  తొలగింపునకు స్పెషల్ డ్రైవ్

చనిపోయినవారి పింఛన్ల  తొలగింపునకు స్పెషల్ డ్రైవ్
  • ఈ నెల 15 నుంచి జూన్​ 15 వరకు లైవ్​నెస్ ఆథెంటికేషన్
  • గ్రామసభల నిర్వహణకు అధికారులకు ఆదేశాలు
  • వృద్ధులు, మంచానికి పరిమితమైనవారు, దివ్యాంగుల కోసం ఇంటి వద్దే ధ్రువీకరణ 

హైదరాబాద్, వెలుగు: కొత్త చేయూత పింఛన్ల మంజూరుకు సిద్ధమవుతున్న సర్కారు.. పాత పింఛన్లలో అనర్హుల ఏరివేతకు, మరీ ముఖ్యంగా మరణించినవారి పేర్ల తొలగింపునకు సిద్ధమైంది. ఇందుకోసం ‘లైవ్‌‌‌‌ నెస్ అథెంటికేషన్’ (జీవించి ఉన్నట్టు ధ్రువీకరణ) పేరుతో ఈ నెల 15 నుంచి స్పెషల్​డ్రైవ్​ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామసభలు ఏర్పాటు చేసి అనర్హులు, చనిపోయినవారి పేర్లు తొలగించాలని, ఈ ప్రక్రియను జూన్ 15 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించనుంది.

గ్రామసభ ఆమోదంతోనే పేర్ల తొలగింపు

రాష్ట్రంలో నిరుపేదలు, నిస్సహాయులకు అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారిపడుతున్నట్టు ఇటీవల సామాజిక తనిఖీల్లో వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులకు, పెద్ద ఎత్తున భూములు, భవంతులు, కార్లు ఉన్నోళ్లకు, ఆఖరికి పెట్రోల్ బంకుల యజమానులకు, వారి కుటుంబ సభ్యులకు సైతం పింఛన్ అందుతున్నట్టు బయటపడింది. ఇక వైక్యలం లేకున్నా దివ్యాంగ పింఛన్, 50 ఏండ్లు నిండకున్నా వృద్ధాప్య పింఛన్​ అందుకుంటున్నవారూ ఉన్నారు. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించకపోవడంతో వారి ఖాతాల్లోనూ పింఛన్లు పడ్తున్నాయి.

ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు సర్కారు రెడీ అయ్యింది. కానీ, లబ్ధిదారుల జాబితాల్లోంచి అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగించే ముందు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, మంచానికే పరిమితమైనవారు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ ‘డోర్ స్టెప్’ పద్ధతిలో ధ్రువీకరణ పూర్తి చేయాలని ఆదేశించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ లైవ్‌‌‌‌నెస్ ఆథెంటికేషన్ ద్వారా అనర్హులను ఏరివేయడంతోపాటు అర్హుల కొత్త పింఛన్లకు లైన్​క్లియర్ కానుంది. 

కొత్తగా 2 లక్షలు పింఛన్లు మంజూరు.. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 42.23 లక్షల మందికిపైగా లబ్ధిదారులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సుమారు లక్ష మందికి పింఛన్లు మంజూరు చేసింది. తాజాగా మరో 2 లక్షల పింఛన్లు ఇచ్చేందుకు సర్కార్​ సిద్ధమైంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మరణించినప్పటికీ వారి పేరుతో ఇప్పటికీ పింఛన్లు మంజూరవుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా స్పెషల్​డ్రైవ్​కు సర్కారు నిర్ణయించింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సామాజిక భద్రత పెన్షన్లకు లైవ్ అథెంటికేషన్‌‌‌‌ను తప్పనిసరి చేయడంతో రాష్ట్ర సర్కారు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌‌‌‌వేర్ (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్), బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్‌‌‌‌ను అందుబాటులోకి తెస్తోంది.