
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గాలేరు -నగరి, హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టుల విస్తరణ చేపట్టిందని, వాటిని ఆపాలని కేఆర్‌ఎంబీని తెలంగాణ కోరింది. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్2లోని ప్యాకేజీ 52 వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో 8 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రతిపాదించారని తెలిపారు.
మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి చెరువులు నింపేందుకు బైపాస్ కెనాల్‌కు ప్రపోజల్ పెట్టారని, గాలేరు నగరి మెయిన్ కెనాల్‌పై క్రాస్ రెగ్యులేటర్, తూము, అన్నమయ్య జిల్లాలో కాలిబండ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఏపీ టెండర్లు పిలిచిందన్నారు. అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ అనుమతి లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టుల పనులు వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు.