- బిల్డింగ్ అనుమతుల దశలోనే వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక
- బిల్డ్ నౌ పోర్టల్లో సీ అండ్ డీ వ్యర్థాలపై కొత్త రూల్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: భవన నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల (సీ అండ్ డీ వేస్ట్) నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే బిల్డ్ నౌ ఆన్‌లైన్ పోర్టల్‌లోనే సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయనున్నది. ఈ మేరకు ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ జీవో 841 జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ పరిధిలో ఇది అమలు చేయనున్నారు.
అనుమతుల్లో షరతులు..
భవన అనుమతుల కోసం దరఖాస్తు చేసే టైంలోనే యజమానులు, డెవలపర్లు సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత నిర్మాణ ప్రాజెక్టులకు సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను భవన అనుమతి దశలోనే సమర్పించాలి. నిర్మాణం లేదా కూల్చివేత టైంలో వచ్చే వ్యర్థాలను ప్రభుత్వం గుర్తించిన రీసైక్లింగ్ సంస్థల ద్వారానే తరలించేలా అనుమతుల్లో షరతులు విధించనున్నారు.
ఓసీకి ముందు డిస్పోజల్ సర్టిఫికెట్
భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే ముందు సీ అండ్ డీ వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రానికి తరలించినట్లు ధ్రువీకరించే ‘డిస్పోజల్ సర్టిఫికెట్’ సమర్పించడం తప్పనిసరి చేయనున్నారు. దీంతో నిర్మాణ వ్యర్థాలను ఇష్టానుసారంగా ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన, చెరువులు, నాలాల్లో పడేయకుండా నియంత్రించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
రీసైకిల్ ఉత్పత్తులకు ప్రాధాన్యం..
మౌలిక వసతుల కోసం, కార్పొరేషన్లు చేపట్టే సివిల్ పనుల్లో నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైనంత మేర రీసైకిల్ చేసిన సీ అండ్ డీ ఉత్పత్తులనే వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. దీని ద్వారా నిర్మాణ వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడంతో పాటు రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం లభించనున్నది.
