V6 News

తెలంగాణ ఖనిజ ఆదాయంలో రికార్డు వృద్ధి.. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.5,650  కోట్లు

తెలంగాణ ఖనిజ ఆదాయంలో రికార్డు వృద్ధి.. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.5,650  కోట్లు
  • బొగ్గు మినహా ఇతర మినరల్స్​తో దాదాపు రూ.3,300 కోట్ల ఇన్​కమ్​
  • గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 33 శాతం వృద్ధి
  • మేజర్ మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 21 శాతం, మైనర్ మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34 శాతం 
  • గనుల కేటాయింపులో రాజకీయ జోక్యానికి తావులేకుండా బ్లాకుల వేలం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గనుల శాఖ ఆదాయార్జనలో రికార్డును సృష్టించింది. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు మినహా ఇతర ఖనిజాల ద్వారా రూ.3,300  కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 33 శాతం వృద్ధి కావడం గమనార్హం. అటు బొగ్గు గనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపితే మొత్తం రూ. 5,650  కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఆదాయం పెరగడానికి కేవలం ఖనిజాల వెలికితీత మాత్రమే కాకుండా, ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తోడయ్యాయి. సీనరేజ్ ఫీజును 20 శాతం మేర శాస్త్రీయంగా సవరించడం వల్ల అదనంగా రూ.100 కోట్ల ఆదాయం లభించింది. మేజర్ మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 21 శాతం, మైనర్ మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34 శాతం వృద్ధి నమోదైంది. 

పర్యావరణ పరిరక్షణ కోసం విధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఫీజుతో కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. గతంలో ఖనిజ బ్లాకుల కేటాయింపులో ఉన్న అస్పష్టతను తొలగిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఎంఎండీఆర్​ చట్టం ప్రకారం వేలం ప్రక్రియను  ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. మేజర్ మినరల్స్ విభాగంలో మూడు దశల్లో 6 సున్నపురాయి బ్లాకులను వేలం వేయగా సుమారు రూ. 21.22 కోట్ల ఆదాయం లభించింది. గనుల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా, అత్యధిక బిడ్ దాఖలు చేసిన వారికే లీజులు కేటాయించడం కలిసొచ్చింది.

ఇసుక, మైనర్​ బ్లాకుల వేలంతో పెరిగిన ఆదాయం

కేవలం మేజర్ మినరల్స్ మాత్రమే కాకుండా, మైనర్ మినరల్స్ కేటాయింపులోనూ వేలం పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు నాలుగు దశల్లో 54 బ్లాకులను వేలం వేసి రూ. 61.49 కోట్ల రాబడిని సాధించింది. ఐదో దశలో భాగంగా మరో 16 బ్లాకులకు నోటిఫికేషన్ జారీ చేయడంతో మైనింగ్ రంగంలో పోటీ పెరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన వాటా పైసా పోకుండా ఖజానాకు చేరుతోంది. వేలం ప్రక్రియతో పేరుగాంచిన మైనింగ్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.

వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొడంగల్, సూర్యాపేటలోని పసుపులబోడు వంటి ప్రాంతాల్లోని సున్నపురాయి బ్లాకులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంతో  వచ్చిన ఆదాయమే కాకుండా, భవిష్యత్తులో ఈ గనుల నిర్వహణ ద్వారా లభించే రాయల్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతంగా మారనుంది. ఇసుక అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. 2024–25లో రూ. 722 కోట్లుగా ఉన్న ఆదాయం, 2025–-26 నాటికి 35 శాతం వృద్ధి సాధించి 

రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది. ఇసుక బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఎస్ఎస్​ ఎమ్​ఎమ్​ఎస్​ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆధునీకరించడంతో పాటు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణను 
ప్రారంభించింది. ‘జీరో టాలరెన్స్’ విధానంతో ఇసుక అక్రమ నిల్వలు, ఓవర్ లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉక్కుపాదం మోపుతోంది. కలెక్టర్లు  ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో అక్రమాలకు 
చెక్ పెట్టి ఆదాయం పెంచుకున్నది.

టెక్నాలజీతో మానిటరింగ్, అక్రమాలకు చెక్.. ​

గనుల రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ మైనింగ్, రవాణాకు చెక్ పెట్టేందుకు గనుల శాఖ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శాటిలైట్ ఇమేజరీ ఆధారిత ‘చేంజ్ డిటెక్షన్ సిస్టమ్’ ద్వారా గనుల సరిహద్దుల్లో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. డ్రోన్లు, శాటిలైట్​ ఫొటోలతో అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించి వెంటనే జరిమానాలు విధించేలా వ్యవస్థను రూపొందించింది.  ఖనిజాలను మోసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్​ (ఏఎస్​ 140) ట్రాకింగ్ తప్పనిసరి చేయడమే కాకుండా, క్వారీలు, క్రషర్ల వద్ద ఏఎన్​పీఆర్​ సిస్టమ్, సీసీటీవీ  కెమెరాలను ఏర్పాటు చేసింది. 

వే బ్రిడ్జిలను నేరుగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించడం ద్వారా లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేసింది. ఈ మొత్తం నిఘా వ్యవస్థను రాష్ట్రస్థాయిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించి, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంది. మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ వ్యవస్థను బలోపేతం చేసింది. జీఐఎస్​ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ తో రాష్ట్రంలోని ఖనిజ లభ్యతను మ్యాపింగ్ చేయడంతో పెట్టుబడిదారులకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తోంది. టెక్నాలజీ వినియోగం వల్ల అక్రమాలు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు.