జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడు: మంత్రి జగదీశ్‌రెడ్డి

జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడు: మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జల వివాదాలపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలకు పనికొచ్చే ఫార్ములాను సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే, జగన్ దానిని పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారని ఆరోపించారు. తెలంగాణ చేస్తున్న పనుల్లో ఈసమెత్తు తప్పులేదని, తప్పు చేసినోళ్లే ఇప్పుడు లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నీళ్లు దోచుకున్నారని, ఇప్పుడు తండ్రిని మించిన దుర్మార్గుడిలా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవర్తిస్తున్నారని అన్నారు. సమస్యను సృష్టించిందే ఆంధ్రా సర్కార్‌‌ అని మంత్రి అన్నారు. ‘కోర్టుకిచ్చిన మాట తప్పిందెవరు? హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? ఏపీ సర్కారు జీవోల పేరిట చిలకపలుకులు పలుకుతోంది. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవోనైనా ఇచ్చారా? సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలకులు సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. గతంలో వరుసగా ఏడేండ్ల కరువులో వచ్చిన సమయంలోనూ కృష్ణాడెల్టాకు నీళ్లు వదిలారని గుర్తు చేశారు. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపుల ద్వారా శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని, కానీ ఇకపై ఆడుకుంటాం,వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కుల్ని ఎవరూ హరించ లేరని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడాన్ని ఏపీ సర్కారు తప్పుబట్టడంపైనా మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని, చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, ఇరు రాష్ట్రాలకూ పని కొచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే సీఎం కేసీఆర్ అన్న విషయం గుర్తుంచుకోవాలని, అయినా దానిని పక్కన పెట్టేసి ఏపీ సర్కారు అహంకారంతో పోతోందని అన్నారు.