- ఆర్టీసీ కార్మికులకు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వెంకట్ రెడ్డి, దామోదర విజ్ఞప్తి
- సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని భరోసా
- ఏప్రిల్ 24న డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మరో దఫా చర్చలు జరుగుతాయని వెల్లడి
- సమ్మె విరమించాలని కార్మికులకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని, కార్మికులెవరూ ఆవేశంలో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, ప్రభుత్వంపై విశ్వాసంతో సమ్మె విరమించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గురువారం సాయంత్రం సెక్రటేరియెట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేబినేట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చ జరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. అందువల్లే ప్రభుత్వం అధికారుల కమిటీ వేసిందని, డిప్యూటీ సీఎం అధ్వర్యంలో శుక్రవారం జరగనున్న చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు కేబినెట్ విజ్ఞప్తి చేసినట్లు మంత్రులు వెల్లడించారు.
ఆర్టీసీ బలోపేతానికి అనేక చర్యలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందించడమే కాకుండా ఆర్టీసీ బలోపేతానికి అనేక చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2013కు సంబంధించిన పీఆర్సీ బకాయిలు రూ.280 కోట్లు విడుదల చేశామని, 2017 పీఆర్సీని అమలు చేస్తున్నామని చెప్పారు. కారుణ్య నియామకాలు, డిస్మిస్ అయిన ఉద్యోగుల సమస్యలు, కొత్త ఉద్యోగాల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఉద్యోగ భద్రత ఉండదనేది కేవలం అపోహ మాత్రమేనని, ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం కార్మికులతో భేటీ అవుతుందని వెల్లడించారు. కార్మికుల 32 డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కార్మికుల నాయకులతో చర్చలు జరుగుతాయన్నారు. రాజకీయ ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలకు రావాలి: మంత్రి దామోదర
ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులతో సమానమని, ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమ్మెను ఉధృతం చేయాలనే ఆలోచన పక్కనపెట్టి, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలకు రావాలని కోరారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
ఆర్టీసీకి ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 58 రోజుల సమ్మె జరిగినా, 36 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచే వారితో చర్చిస్తోందని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే వారి మాటలు నమ్మి కార్మికులు ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, సంయమనం పాటించాలని విజ్ఞ ప్తి చేశారు. ఆర్టీసీని కాపాడుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

