బడి బాగుపడింది.. ర్యాంకు ఎగబాకింది.. పీజీఐ 2.0లో తెలంగాణ 10 స్థానాలు మెరుగు

బడి బాగుపడింది..  ర్యాంకు ఎగబాకింది.. పీజీఐ 2.0లో తెలంగాణ 10 స్థానాలు మెరుగు
  • 18వ స్థానంతో 'ప్రచేష్ట-3' గ్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన స్కోరు
  • జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన  రాష్ట్ర విద్యా విధానాలు 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ2.0) ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ విద్యాశాఖ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయిలో గతంలో 28వ స్థానంలో నిలిచిన రాష్ట్రం.. పది స్థానాలు ముందుకు జరిగి ప్రస్తుతం18వ ర్యాంకుకు చేరుకుంది.

మొత్తం 1000 స్కోరుకు గానూ 2024-–25 విద్యా సంవత్సరంలో 552.5గా ఉన్న తెలంగాణ స్కోరు, 2025-–26 నాటికి 599.7 మార్కులకు చేరింది. దీనితో గతంలో ఆకాంక్షి-1 విభాగంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు ప్రచేష్ట-3  గ్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల పరిధిలో విద్యా ప్రమాణాల సూచీలు సానుకూల ఫలితాలను చూపించాయి.

ఇందులో ముఖ్యంగా జనగాం 383 స్కోరుతో, మంచిర్యాల 360 స్కోరుతో ‘ఉత్తమ్-3’ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాయి. విద్యాశాఖలో గత కొంతకాలంగా చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ లెర్నింగ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు వంటి పద్ధతుల వల్లే ఈ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పు సాధ్యమైందని అధికారులు వెల్లడించారు. 

డిజిటల్ మాడ్యూళ్లు.. పాఠ్యాంశాల్లో ఏఐ..  

పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు 1,354 బడుల్లో  ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం ద్వారా 15,848 మంది విద్యార్థులకు భాష, మ్యాథ్స్ నైపుణ్యాల్లో పునాది శిక్షణ ఇస్తున్నారు. 194 మోడల్ స్కూళ్లు, 495 కేజీబీవీల్లో ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాలా ద్వారా ఉచిత డిజిటల్ కోచింగ్, ఖాన్ అకాడమీ ద్వారా మ్యాథ్స్, సైన్స్ బోధన అందుతోంది.

వీటి కోసం 1,132 పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 2,036 పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 2025-–26 విద్యా సంవత్సరం నుంచి.. 1వ తరగతి మొదలు 9వ తరగతి వరకు ఏఐ, కోడింగ్, డేటా హ్యాండ్లింగ్ వంటి డిజిటల్ లెర్నింగ్ మాడ్యూళ్లను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు.

అంతర్జాతీయ విద్యా విధానాల పరిశీలన కోసం సుమారు 500 మంది ఉపాధ్యాయులు, అధికారులు ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో అధ్యయన పర్యటనలు చేశారు. ఈ సంస్థాగత మార్పుల ఫలితంగానే 2025-–26 పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 95.15 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 5,731 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించి జాతీయ సగటు కంటే మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకున్నాయి.

టీచర్లకు ట్రైనింగ్, ప్రమోషన్లు, బదిలీలు.. 

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచే ప్రక్రియలో భాగంగా విద్యాశాఖ 10,006 ఉపాధ్యాయ నియామకాలను చేపట్టింది. అలాగే దశాబ్ద కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో 1,382 మందికి కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం కల్పించారు. సుమారు పదేళ్ల విరామం తర్వాత 1,12,882 మంది ఉపాధ్యాయులకు వేసవి కాలంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

2018 తర్వాత మొదటిసారిగా 2024 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34,706 మంది టీచర్లకు బదిలీలు చేపట్టడంతో పాటు, వివిధ కేడర్లలోని 25,950 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించారు. ఈ పారదర్శక చర్యల ప్రభావం క్షేత్రస్థాయి బోధనపై సానుకూల ప్రభావం చూపింది. నేషనల్ అచీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వే గణాంకాల ప్రకారం 3వ తరగతి విభాగంలో రాష్ట్ర ర్యాంకు 36 నుంచి 26కు, 8, 9 తరగతుల విభాగంలో 26 నుంచి 17వ స్థానానికి చేరింది.

బాలికల విద్యను ప్రోత్సహించేందుకు మరో 120 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసి, అందులో 93 పాఠశాలలను ‘యంగ్ ఇండియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మారుస్తూ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.