V6 News

తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : పార్లమెంటు ఆవరణలో ఎంపీలు, మంత్రి వివేక్ నిరసన

తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : పార్లమెంటు ఆవరణలో ఎంపీలు, మంత్రి వివేక్ నిరసన

తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా విరసనలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు, తెలంగాణ వాదులు ఎంపీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. 2026 ఏప్రిల్ 17వ తేదీన పార్లమెంటు ఆవరణలో తెలంగాణ ఎంపీలతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తదితరులు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. త

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని మంత్రి వివేక్ ఈ సందర్భంగా అన్నారు. బీజేపీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఖండించక పోవడం సిగ్గుచేటని విమర్శించారు. 

తెలంగాణపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీజేపీ సూర్య వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా.. అంటూ ప్రశ్నించారు. గతంలో మోదీ కూడా తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలే చేసినట్లు గుర్తు చేశారు. 

ఏంటి వివాదం:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ అక్కసు మరోసారి బయటపడింది. ఆ పార్టీకి చెందిన కర్నాటక నేత, ఎంపీ తేజ‌‌స్వి సూర్య గురువారం లోక్ సభలో మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్ర విభజనను తప్పుబట్టేలా విమర్శలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చారు. బ్రిటిషర్స్ కంటే చెత్తగా తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని.. ఆనాడు ఇండియా, పాకిస్తాన్ విభజన మాదిరిగా తెలంగాణ, ఏపీని విభజించారని.. ఆ స‌‌మ‌‌యంలో కాంగ్రెస్ వ్యవ‌‌హరించిన తీరుతో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మ‌‌ధ్య ఘ‌‌ర్షణ వాతావర‌‌ణం నెల‌‌కొందని విమర్శించారు. 

గతంలో ప్రధాని మోదీ సైతం పార్లమెంట్ వేదికగా.. తెలంగాణ ఏర్పాటును ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. మరోసారి.. తలుపులు మూసి ఏపీని విభజించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే, డీలిమిటేష‌‌న్​పై ప్రతిప‌‌క్షాలు ద‌‌క్షిణాది రాష్ట్రాల ప్రజ‌‌ల‌‌ను త‌‌ప్పుదారి పట్టిస్తున్నాయ‌‌ని తేజ‌‌స్వి ఆరోపించారు.