తెలంగాణ నూతన డీజీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 29న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో భేటీ అయ్యారు.
రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో తనపై నమ్మకం ఉంచి డీజీపీగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు ఈ సందర్భంగా సీవీ ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం,పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే అంశాలపై సీఎం ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు సమాచారం.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉన్న సీవీ ఆనంద్, ఇప్పుడు రాష్ట్ర పోలీస్ బాస్ (DGP) గా పగ్గాలు చేపట్టడంతో పోలీస్ శాఖలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఐసీసీసీలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీవీ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలుపారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వహించాలని సూచించారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)ను డీజీపీగా నియమిస్తూ సీఎస్ కే.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఏప్రిల్30న పదవీవిరమణ పొందనున్నారు. ఈ క్రమంలోనే మే 1న సీవీ ఆనంద్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారుల్లో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్‌ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన విషయం తెలిసిందే. అందులో సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యామిశ్రా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ కావడంతో డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్(-హెచ్‌ఓపీఎఫ్)గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డీజీపీలు నియమితులైన అందరూ తొలుత ఇంచార్జి డీజీపీగాలు బాధ్యతలు నిర్వహించగా.. సీవీఆనంద్ మాత్రం పూర్తిస్థాయి డీజీపీగా నియమితులు కావడం గమనార్హం. డీజీపీగా 2028 జూన్ వరకు సీవీ ఆనంద్ కొనసాగనున్నారు.

