- ప్రభుత్వానికి ఉన్నతాధికారుల నివేదిక
- వరి, పత్తి, మక్క, మిరప, కంది, కూరగాయల్లో మోతాదుకు మించి డేంజరస్ పెస్టిసైడ్స్
- మోనోక్రోటోఫాస్ , క్లోరిపైరిఫాస్, గ్లైఫోసేట్, ఇమిడాక్లోప్రిడ్, సైపర్మెత్రిన్లాంటి ప్రమాదకర రసాయనాలు
- క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్, శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి చూపు దెబ్బతినడం, ఫెర్టిలిటీ సమస్యలు
- నివారణకు ప్రత్యేక రోడ్ మ్యాప్ అమలు చేయాలని సర్కారుకు సిఫార్సు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ, క్యాన్సర్, లివర్ రోగాలకు అదుపులేని పురుగుమందుల వాడకం, విచ్చలవిడి ఆహార కల్తీలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 80 శాతం రోగాలు ఈ రెండు కారణాల వల్లే వస్తున్నాయని, ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రత్యేక ‘రోడ్ మ్యాప్’ రూపొందించి అమలు చేయకపోతే భవిష్యత్తులో పంటల సాగుతో పాటు సాధారణ జీవనం కూడా అతలాకుతలం అవుతుందని హెచ్చరించారు.
వరి, పత్తి, మక్కజొన్న, మిరప, కందులు, కూరగాయల సాగులో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. పంటల మార్పిడితో పాటు డేంజరస్ పెస్టిసైడ్స్ వాడకం లేకుండానే ఎక్కువ దిగుబడి వచ్చేలా చేయడంతో పాటు ఆయా పంట ఉత్పత్తులకు తగిన ధర కల్పించాల్సి ఉంటుందని సూచించారు. ఇవి ‘బయో మాగ్నిఫికేషన్’ ప్రక్రియ ద్వారా ఆహార గొలుసులోకి చేరి మనుషుల శరీరంలో పేరుకుపోతున్నాయని వివరించారు. కల్తీపై ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకునే విధంగా స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు సీజన్లలో కలిపి వరి సాగు సుమారు 1.20 కోట్ల ఎకరాలు, పత్తి సాగు 50 లక్షల ఎకరాలకు పైగా సాగవుతోంది. సాగు విస్తీర్ణంతో పాటే రసాయన ఎరువుల వినియోగం దేశ సగటు కంటే రెట్టింపు స్థాయిలో పెరిగిందని పార్లమెంట్ గణాంకాలు, వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లిడిస్తున్నాయని పేర్కొన్నారు. ఎకరాకు యావరేజ్‌గా 100 కిలోల నుంచి 150 కిలోల ఎరువులను వాడుతున్నారు. ఎన్పీకే (నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సి ఉండగా, రాష్ట్రంలో ఇది ఆందోళనకరంగా 8:3:1గా ఉందని తెలిపారు. అంటే యూరియా (నత్రజని) వినియోగం అతిగా జరుగుతోంది.
ఫలితంగా భూమి తన సహజమైన సారవంతమైన గుణాన్ని కోల్పోయి, వానపాములు, సూక్ష్మజీవులు నశించి నేల గట్టిపడుతోంది. ఈ దుష్ప్రభావం భూగర్భ జలాల్లో నైట్రేట్ల స్థాయిని పెంచి, తాగునీటిని సైతం కలుషితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎరువుల వినియోగం జాతీయ సగటు కంటే రెట్టింపు ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏండ్ల కాలంలో రాష్ట్రంలోని మెజారిటీ భూముల్లో పంటలు అతి తక్కువ దిగుబడికి పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.
అసలే నిషేధితం.. అందులోనూ మోతాదు మించి
వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, కందులు, కూరగాయల సాగులో మోతాదుకు మించి ప్రమాదకరమైన పురుగు మందులను వాడుతున్నారు. మోనోక్రోటోఫాస్, క్లోరిపైరిఫాస్, గ్లైఫోసేట్, ఇమిడాక్లోప్రిడ్, సైపర్‌మెత్రిన్ వంటి నిషేధిత లేదా నియంత్రిత రసాయనాలను యథేచ్ఛగా వినియోగంలో ఉన్నాయి. పత్తి, మిర్చి పంటలకు కొన్ని ప్రాంతాల్లో సీజన్‌కు 15 –20 సార్లు పిచికారీ చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. దేశంలో ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల పురుగు మందులు వినియోగిస్తుండగా, పత్తి పంటకే దాదాపు 50% వాడుతున్నారు.
తెలంగాణలో ఏటా 6,000 మెట్రిక్ టన్నుల పురుగు మందులు అమ్ముడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిషేధానికి గురవుతున్న మోనోక్రోటోఫాస్, క్లోరిపైరిఫాస్, గ్లైఫోసేట్, ఇమిడాక్లోప్రిడ్, సైపర్‌మెత్రిన్ వంటి రసాయనాలను ఇక్కడ యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిర్చి పంటకు సీజన్‌లో ఏకంగా 20 –25 సార్లు పిచికారీ చేస్తున్నట్లు పరిశీలనలో తేలింది. 'గ్లైఫోసేట్' అనే కలుపు సంహారకం వాడకంతో క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తున్నా, తెలంగాణలోని పత్తి పొలాల్లో దీని వాడకం విచ్చలవిడి అయిందని ప్రభుత్వానికి అధికారులు వివరించారు.
‘బయో మాగ్నిఫికేషన్’తో శరీరంలోకి చేరడంతోనే రోగాలు
ఈ రసాయనాలు ‘బయో మాగ్నిఫికేషన్’ ప్రక్రియ ద్వారా పంటల గింజలు, ఆకులు, కాయల నుంచి నేరుగా మన శరీరంలోకి చేరి ప్రాణాలను తీస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. నిమ్స్ వంటి హాస్పిటల్స్‌లో నమోదవుతున్న కేసుల విశ్లేషణ ప్రకారం, పురుగు మందుల అవశేషాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్త క్యాన్సర్, లింఫోమా కేసులు గత పదేళ్లలో తెలంగాణలో 30 శాతం పెరిగాయి. కిడ్నీలు రక్తంలోని విషాలను శుద్ధి చేసే క్రమంలో ఈ భారలోహాల ధాటికి దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కిడ్నీ రోగుల సంఖ్య పెరగడానికి సాగులో వాడుతున్న ఫాస్పేట్ ఎరువుల్లోని ఫ్లోరైడ్, కాడ్మియం అవశేషాలే కారణమని స్థానిక స్టడీస్ స్పష్టం చేశాయని పేర్కొన్నారు.
కేవలం శారీరక వ్యాధులే కాకుండా, నాడీ వ్యవస్థ సంతానోత్పత్తిపై కూడా ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పురుగు మందుల ప్రభావంతో మెదడులోని నరాలు దెబ్బతిని పార్కిన్సన్స్ (వణుకు వ్యాధి), అల్జీమర్స్ వంటివి వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల యువతలో సంతానలేమి సమస్యలు విపరీతంగా పెరగడానికి ఆహారంలోని ఈ 'ఎండోక్రైన్ డిస్రప్టర్స్' ప్రధాన కారణమని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం, మహిళల్లో అండాల ఉత్పత్తి దెబ్బతినడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. గర్భిణులు తీసుకునే ఆహారం ద్వారా ఈ విషాలు గర్భస్థ శిశువుకు చేరి, పిల్లల్లో ఎదుగుదల లోపాలు రావడానికి కారణమవుతున్నాయని పొందుపరిచారు.
కల్తీ రక్కసి కోరలు
ఒకవైపు సాగులో విషం ఉంటే, మరోవైపు మార్కెట్లోకి వచ్చే ఆహారం కల్తీ రక్కసి కోరల్లో చిక్కుకుందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం వాడే పాలలో యూరియా, డిటర్జెంట్, ఆయిల్ కలిపి కృత్రిమ పాలు తయారు చేస్తుండగా, మిర్చి పొడిలో ఇటుక పొడి, రోడమైన్-బి వంటి క్యాన్సర్ కారక రంగులు కలుపుతున్నారు. పసుపులో మెటానిల్ ఎల్లో, వంట నూనెల్లో ఆర్గిమోన్ ఆయిల్ కలిపి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మార్కెట్లలో సేకరించిన నమూనాలలో 25 శాతం వరకు కల్తీ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
పండ్లను కృత్రిమంగా పండించడానికి వాడే కాల్షియం కార్బైడ్ నేరుగా కాలేయాన్ని దెబ్బతీస్తోంది. ఈ కల్తీ పద్ధతుల వల్ల లివర్ సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది హోటళ్లు, తయారీ కేంద్రాలు ఉంటే, వాటిని తనిఖీ చేసేందుకు కేవలం 70 మంది లోపే ఇన్‌స్పెక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. పట్టుబడిన కల్తీ కేటుగాళ్లకు కఠిన శిక్షలు పడకపోవడం వల్ల వారు యధేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నిందితుల ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని స్పష్టం చేసింది.
