హైదరాబాద్, వెలుగు: నిషేధిత సింథటిక్ మాంజా అమ్మే దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం అరణ్యభవన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా రాజస్తాన్, గుజరాత్ నుంచి వచ్చే సింథటిక్ మాంజా సరఫరాలపై నిఘా పెంచాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో చైనా మాంజా అమ్మకుండా పోలీసులు, సంబంధిత సంస్థలు చర్యలు తీసుకోవాలన్నారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మాంజా నిషేధంపై అవగాహన కల్పించాలని సూచించారు. దుర్గా మండపాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా చూడాలన్నారు. బస్సుల్లో మాంజా, పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల తరలిస్తే అటవీ శాఖ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చేలా డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు ఇవ్వాలన్నారు.
