- పల్లెల్లోనూ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు: సీఎస్ కె. రామకృష్ణారావు
- అపార్ట్‌మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి: నవీన్ మిట్టల్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎస్ కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ఛార్జింగ్సెంటర్ల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ మాట్లాడారు. ఈవీ వెహికల్స్ వినియోగం పెరిగిందని, పల్లె, పట్టణాల్లోనూ ఛార్జింగ్సెంటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్థలాలను గుర్తించాలన్నారు.
ఛార్జింగ్సెంటర్ల పర్యవేక్షణకు రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్ ను డెవలప్ చేయాలని ఆదేశించారు. ఈవీ కేంద్రాల ఏర్పాటు, పారదర్శకత, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు డ్యాష్‌బోర్డు ఉపయోగపడుతుందన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ అపార్ట్ మెంట్ భవనాల బేస్‌మెంట్‌లలో తప్పనిసరిగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. హోమ్ ఛార్జింగ్ అవకాశాలను కల్పిస్తే ఈవీ వినియోగం పెరుగుతుందన్నారు.

