- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల భేటీ
- అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉంచుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
- గ్రామీణ పేదల ఉపాధికి భంగం కలిగించే నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీబీ జీ రామ్ జీ చట్టం–2025’పై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉపాధి పనుల మధ్య 60 రోజుల విరామం, తదితర నిబంధనలు సవరించాలని కొన్నాళ్లుగా డిమాండ్‌చేస్తున్నా.. మంత్రులు, అధికారుల స్థాయిలో ఢిల్లీకి లేఖలు రాస్తున్నా కేంద్రం నుంచి కనీస స్పందన కరువైంది.
అటు రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపుతూ.. అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉంచుకోవడాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం తప్పు పడ్తోంది. తాజాగా శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్సబ్ కమిటీ సమావేశమై, సమస్యలపై చర్చించింది. త్వరలో ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిగే సమావేశంలో తెలంగాణ అభ్యంతరాలను వినిపించాలని, అప్పటికీ స్పందించకుంటే ఈ చట్టంలోని ప్రజా వ్యతిరేక నిబంధనలను న్యాయపరంగా, రాజ్యాంగపరంగా అడ్డుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ విషయంలో- కర్నాటక, కేరళ సీఎంలతో చర్చించి న్యాయపరమైన, రాజకీయ కార్యాచరణపై ముందుకు వెళ్తామని, జులై 2న జరగబోయే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ స్పష్టంచేసింది. శనివారం సెక్రటేరియట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ రెండో సమావేశంలో మంత్రులు సీతక్క హాజరుకాగా.. తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని చట్టంలోని లోపాలపై చర్చించారు.
ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారాన్ని మోపుతూ.. అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉంచుకోవడాన్ని కమిటీ తప్పుబట్టింది. పనుల ఎంపిక, ప్రణాళిక, ఆమోదం వంటి కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలకు ఏమాత్రం స్వేచ్ఛ లేకపోవడం అన్యాయమని కమిటీ అభిప్రాయపడింది.
60 రోజుల విరామం నిబంధనపై అభ్యంతరం..
ఉపాధి పనుల మధ్య 60 రోజుల విరామం ఉండాలన్న నిబంధనపై మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం, వ్యవసాయ పనుల పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని, రెండు నెలల పాటు కూలీలకు పని లేకుండా చేస్తే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. డిమాండ్ ఆధారంగా నిధులు ఇవ్వకుండా ‘నార్మెటివ్ అలొకేషన్’ పేరుతో నిధుల కోత విధించడం సరికాదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిగే సమావేశంలో తెలంగాణ అభ్యంతరాలను వినిపించాలని నిర్ణయించారు. కొత్త చట్టం వల్ల కలిగే అదనపు భారాన్ని కేంద్రమే భరించాలని డిమాండ్ చేయనున్నారు. కాగా, సమీక్ష తర్వాత కార్మిక, పౌర, ప్రజా సంఘాల ప్రతినిధులతో సబ్ కమిటీ సమావేశమైంది.
వారు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. జులై 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రం తుది కార్యాచరణ ప్రకటించనుంది. సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్
తదితరులు పాల్గొన్నారు.
