లీజు పైసలు కట్టని సంస్థలకు కరెంటు ఇవ్వొద్దు

లీజు పైసలు కట్టని సంస్థలకు కరెంటు ఇవ్వొద్దు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని చాలా ఖరీదైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని వ్యాపారాలు చేస్తున్న సంస్థలు కొన్నేళ్లుగా లీజు డబ్బులు చెల్లించడం లేదని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఆదేశించారు. బకాయిపడిన సంస్థల్లో ప్రముఖ హోటళ్లు, థియేటర్లు, టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని, వాటి నుంచి రూ.150.4 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన ఆఫీసులో అధికారులతో ఆయన రివ్యూ చేశారు. లీజ్ డబ్బులు కట్టడానికి సరైన కారణాలు చూపెట్టని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, వెంటనే కరెంటు, నీటి సరఫరా నిలిపేయాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు, వాటర్ సప్లై సంస్థలకు లెటర్లు రాయాలని సూచించారు. 

ట్రైడెంట్ హోటల్ 75 కోట్లు బాకీ
సర్కార్‌‌‌‌కు బకాయిపడిన సంస్థల్లో అత్యధికంగా మాదాపూర్‌‌‌‌లోని ట్రైడెంట్ హోటల్ రూ.75.05 కోట్లు, నెక్లెస్ రోడ్డులోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ రూ.27.45 కోట్లు, జల విహార్ రూ.6.51 కోట్లు, లోయర్ ట్యాంక్ బండ్‌‌లోని స్నో వరల్డ్ రూ.15.01 కోట్లు, ఎక్స్‌‌పో టెల్ హోటల్ రూ.15.13 కోట్లు, శామీర్ పేటలోని ప్రజయ్ ఇండియా సిండికేట్ (గోల్ఫ్ కోర్స్) రూ.5.58 కోట్లు, జూబ్లీహిల్స్‌‌లోని దసపల్ల హోటల్ రూ.5.67 కోట్లు చెల్లించాల్సి ఉంది.