ప్రజాపాలనలో రియల్ ఎస్టేట్ జోరు...రెండున్నరేళ్లలో 40 శాతం పెరిగిన ఫ్లాట్ల సేల్స్: మంత్రి పొంగులేటి

ప్రజాపాలనలో రియల్ ఎస్టేట్ జోరు...రెండున్నరేళ్లలో 40 శాతం పెరిగిన ఫ్లాట్ల సేల్స్: మంత్రి పొంగులేటి
  •     తప్పుడు ప్రచారాలను జనం, వ్యాపారులు నమ్మొద్దని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ కొంతమంది గోబెల్స్​ ప్రచారం చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు, వ్యాపారులు నమ్మాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం భూముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ తెచ్చిన భూభారతి చట్టంలోని సాఫ్ట్‌‌‌‌వేర్ లోపాలను రాబోయే15-, 20 రోజుల్లో సరిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. 

మరోవైపు పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మొదటి విడత జీహెచ్‌‌‌‌ఎంసీ, కోర్ ఏరియా పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, స్థల సేకరణతో పాటు రియల్టర్ల కోసం ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శనివారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురామ్‌‌‌‌రెడ్డితో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా తన వద్ద స్పష్టమైన ఆధారాలు, పూర్తి గణాంకాలు ఉన్నాయని వెల్లడించారు. గడిచిన రెండున్నరేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 15 నుంచి 20 శాతం వృద్ధి నమోదు కాగా, ఫ్లాట్ల విక్రయాలు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయని చెప్పారు. 

నాటి కాంగ్రెస్ దూరదృష్టి వల్లే అభివృద్ధి

2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ చొరవ, దూరదృష్టి వల్లే హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి రోల్ మోడల్‌‌‌‌గా రూపుదిద్దుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్​ఆర్), శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ సెక్టార్ 360 డిగ్రీల అభివృద్ధి వెరసి ఈ రోజు హైదరాబాద్‌‌‌‌ను అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అత్యధిక శాతం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టేందుకే మొగ్గు చూపారన్నారు. నగరానికి ఉన్న ఈ అపారమైన బ్రాండ్ ఇమేజ్‌‌‌‌ను కాపాడుతూ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. 

ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక నగరాల సరసన నిలిపేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని, కొనుగోలుదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఇవ్వాలన్నారు.   రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రూ. 7 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వారం పది రోజుల్లోనే తొలి విడత కింద 28 కిలోమీటర్ల పరిధికి టెండర్లు పిలుస్తున్నామని ప్రకటించారు. అలాగే పాతబస్తీని కలుపుతూ రెండో విడత కింద 76 కిలోమీటర్ల మేర రూ. 24 వేల కోట్లతో మెట్రో రైల్ విస్తరణకు కసరత్తు చేస్తున్నామన్నారు.