సీఎస్ఆర్ నిధుల్లో విద్యా రంగానికే పెద్దపీట

సీఎస్ఆర్ నిధుల్లో విద్యా రంగానికే పెద్దపీట
  • మూడేండ్లలో రూ. 965 కోట్లు ఖర్చు 
  • సిటీకే ఎక్కువ నిధులు ఇస్తున్న కంపెనీలు 
  • లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో లెక్కలు బయటపెట్టిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్​డిపార్ట్ మెంట్ కే ఖర్చు అవుతున్నాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2021-–22 నుంచి 2023-–24 వరకు) రాష్ట్ర విద్యా రంగానికి మాత్రమే ఏకంగా రూ.964.87 కోట్లు సీఎస్ఆర్ నిధులు వెచ్చించినట్లు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

2021–-22లో రూ.224.86 కోట్లు, 2022-–23లో రూ.348.58 కోట్లు, 2023-–24లో రూ.391.43 కోట్లు కేటాయించారు. ఎడ్యుకేషన్ తర్వాత ఆరోగ్య రంగం(హెల్త్ కేర్)  రెండో స్థానంలో నిలిచింది.2023–-24లో ఆరోగ్యానికి రూ.207 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, విద్యకు మాత్రం దాదాపు రెట్టింపు 
నిధులు రూ. 391 కోట్లు ఖర్చు చేశారు. 

సిటీకే ఎక్కువ నిధులు.. 

గడిచిన మూడేండ్లలో మొత్తం రూ2,783 కోట్ల సీఎస్ఆర్ నిధులు ఖర్చుకాగా..అందులో  62 శాతం రూ1,732 కోట్లు కేవలం హైదరాబాద్ జిల్లాలోనే వెచ్చించారు. రంగారెడ్డి జిల్లాకు మూడేండ్లలో  రూ.273 కోట్లు మాత్రమే దక్కాయి.  

మహారాష్ట్ర, ఏపీ తర్వాతే తెలంగాణ..

దేశవ్యాప్తంగా 2023–-24లో మొత్తం రూ. 34,908 కోట్లు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేశారు.అయితే, దేశంలో సీఎస్ఆర్ నిధుల వ్యయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2023-– 24 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్రలో సంస్థలు ఏకంగా రూ. 6,065 కోట్లు ఖర్చు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో 2023–-24లో ఏపీకి రూ. 1,129 కోట్లు రాగా.. తెలంగాణకు రూ. 1,054 కోట్లు వచ్చాయి. గుజరాత్ (రూ. 2,707 కోట్లు), కర్నాటక (రూ. 2,254 కోట్లు), తమిళనాడు (రూ. 1,968 కోట్లు) కూడా భారీగా నిధులను సేకరించాయి.