నర్సింగ్ ఆఫీసర్ల ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ రిజ్.. వెబ్సైట్లో 40,423 మంది అభ్యర్థుల మార్కుల లిస్ట్

నర్సింగ్ ఆఫీసర్ల ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ రిజ్.. వెబ్సైట్లో 40,423 మంది అభ్యర్థుల మార్కుల లిస్ట్
  •     నేటి నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలకు అవకాశం
  •     ఆ తర్వాతే ఫైనల్ లిస్ట్.. 1:1.5 రేషియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరింది. 2,322 పోస్టుల భర్తీకి సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ)  బుధవారం విడుదల చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల వివరాలు, వారు సాధించిన మార్కులతో కూడిన లిస్టును బోర్డు అధికారిక వెబ్‌‌‌‌ సైట్‌‌‌‌లో పెట్టింది. 

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌‌‌‌ పై అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ఎంహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్బీ అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్‌‌‌‌ సైట్‌‌‌‌లో తమ లాగిన్ ఐడీ ద్వారా అభ్యంతరాలను నమోదు చేయవచ్చు. ఆగస్టు నెలలో సీబీటీ, కాంట్రాక్ట్ వెయిటేజీ మార్కులపై బోర్డు అభ్యంతరాలు స్వీకరించింది. నియామక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకత కోసం మరోసారి అభ్యంతరాలు తెలిపే అవకాశం బోర్డు కల్పించింది. 

జనవరిలోపు రిక్రూట్​మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేలా..

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికయ్యే 2,322 మంది అభ్యర్థులకు జనవరిలోనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేలా  రిక్రూట్​మెంట్​బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం.. సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ ఆధారంగా మెరిట్ ప్రకారం 1:1.5 రేషియోలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌‌‌‌ చేసి.. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. 

ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్లకు లోబడి నియామకాలు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రక్రియ పూర్తయిన 1,260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులతో పాటే వీరికి కూడా నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 7 వేలకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయగా.. తాజా నియామకాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ లో నర్సుల కొరత పూర్తిగా తీరనుంది.