నిప్పుల కొలిమిలా తెలంగాణ.. తీవ్రత ఎలా ఉందో ఈ రామచిలుక మృతే సాక్ష్యం

నిప్పుల కొలిమిలా తెలంగాణ..  తీవ్రత ఎలా ఉందో ఈ రామచిలుక మృతే సాక్ష్యం

తెలంగాణ నిప్పుల కొలిమిలా భగభగ మండుతోంది. వేడి గాలులకు జనాలు అల్లల్లాడి పోతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అగ్నిగోళంలా మండుతోంది. తెలంగాణలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎండలకు పక్షలు, జంతువులు విలవిలలాడి పోతున్నాయి. 

పిట్టల్లా రాలిపోతున్న జనాలు అంటుంటారు కదా. ఈ ఎండలకు పట్టలైతే నిజంగానే రాలిపోతున్నాయి. 2026 మే 21వ తేదీన కరీంనగర్ జిల్లాలో రామచిలక రోడ్డుమీద పడి విలవిలలాడి చనిపోయిన ఘటన కలచి వేస్తోంది. ఎండలు ఎంత భయంకరంగా మండుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపుతోంది ఈ ఘటన. 

జిల్లాలోని హుజురాబాద్ బోర్నపల్లి శివారు లో ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుక రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచింది.  రెండు మూడు రోజుల నుండి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఈ ప్రమాదకరమైన వడ గాలులకు మనుషులే కాదు పక్షులు కూడా ఎండ తీవ్రతకు  ప్రాణాలు విడుస్తున్నాయి. ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి రోడ్డు మీద పడిన చిలుక.. విలవిలలాడి కన్నుమూసింది. ఇంత తీవ్రమైన వడగాలులకు పక్షులు చెట్లపైన, అడవుల్లో ఎన్ని రాలిపోతున్నాయో, మూగజీవాల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. 

తెలంగాణలో ఈ వారం పాటు ఎండలు బలంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. 44 డిగ్రీల పైనే భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు మంటెత్తిస్తాయని IMD పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత, వేడి వాతావరణంతో పాటు వడగాలులు వీచే అవకాశంతో తెలంగాణ జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది . వాతావరణ శాఖ ( Department of Meteorology )హెచ్చరికల మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

►ALSO READ | పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ధాన్యం కుప్పలకు అగ్గి అంటుకుని రూ.20 లక్షల నష్టం

ముఖ్యంగా ఖమ్మం, వరంగల్,నల్గొండ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండటంతో నేడు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. వేడి గాలుల ప్రభావం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు

రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల రహదారులు నిర్మానుష్యంగా మారగా, మధ్యాహ్న వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.అత్యవసరం అయితే తప్ప పగటి వేళల్లో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.చిన్నపిల్లలు,వృద్ధులు,గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరినీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.