రాష్ట్ర ప్రభుత్వానిది ‘తెలంగాణ రైజింగ్‌‌- 2047’ విజన్ : రెసిడెంట్‌‌ కమిషనర్‌‌ శశాంక్‌‌ గోయల్‌‌

రాష్ట్ర ప్రభుత్వానిది ‘తెలంగాణ రైజింగ్‌‌- 2047’ విజన్ : రెసిడెంట్‌‌ కమిషనర్‌‌ శశాంక్‌‌ గోయల్‌‌
  •     రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రెసిడెంట్‌‌ కమిషనర్‌‌ శశాంక్‌‌ గోయల్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్ –2047’ విజన్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఢిల్లోలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్(స్పెషల్ చీఫ్ సెక్రటరీ) శశాంక్ గోయల్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భవన్‌‌ రెసిడెంట్‌‌ కమిషనర్ శశాంక్‌‌ గోయల్‌‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సమన్వయ కార్యదర్శి అద్వైత్‌‌ కుమార్‌‌ సింగ్, డిప్యూటీ కమిషనర్ సంగీతా, భవన్‌‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా శశాంక్‌‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌‌ రెడ్డి దిశానిర్దేశంలో ‘తెలంగాణ రైజింగ్‌‌–2047’ విజన్‌‌ డాక్యుమెంట్‌‌తో ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో నిరుపేదల జీవితాల్లో మార్పులు తెస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌‌ కేవలం ఒక పరిపాలన కేంద్రం కాదని, దేశ రాజధానిలో తెలంగాణ ముఖచిత్రమన్నారు. జూన్‌‌ 5న తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో  కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.