
హైదరాబాద్, వెలుగు :రాష్ట్రంలో బస్సు చార్జీల పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు ఆదివారం అర్ధరాత్రి (సోమవారం తెల్లవారుజాము) నుంచే టికెట్ ధరల పెంపు ఉంటుందని భావించారు. ఇందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే టికెట్ల మిషన్లలో డేటా మార్చడం, చిల్లర డబ్బు సమస్య తలెత్తకుండా ధరలను నిర్ణయించాలన్న ఉద్దేశంతో ఒక రోజు వాయిదా వేసినట్టు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆదివారం పొద్దంతా కసరత్తు జరిగిందని, సోమవారం కూడా పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారని వెల్లడించాయి. ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించి అందజేశారని, వాటికి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని తెలిసింది. అయితే ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ఇంకా సంతకం చేయలేదని సమాచారం. ఆదివారం ప్రగతిభవన్‌లో కార్మికులతో సీఎం సమావేశం కావడంతో ఆర్టీసీ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. పెరిగే ధరల డేటాను టిమ్ మిషన్లలో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ధరల పెంపు ఒకరోజు వాయిదా పడినట్టు సమాచారం.